ఆంధ్ర, తెలంగాణాలకు వేర్వేరు పీసీసీ అధ్యక్షుల నియామకం
posted on Mar 11, 2014 @ 9:50PM
ఇంతవరకు సమైక్య రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడు ఉన్న బొత్ససత్యనారాయణను కాంగ్రెస్ అధిష్టానం ఆ పదవిలో నుండి తప్పించి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు వేర్వేరుగా పీసీసీ అధ్యక్షులను నియమించింది. మాజీ మంత్రులు రఘువీర రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, పొన్నాల లక్ష్మయ్యను తెలంగాణా రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షులుగా నియమించింది. ఉత్తమ కుమార్ రెడ్డిని తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది.
ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఎన్నికల కోసం వేర్వేరుగా మ్యానిఫెస్టో కమిటీ మరియు ప్రచార కమిటీలను కూడా నియమించింది. వీరిలో అందరూ కూడా అధిష్టానానికి వీర విధేయులుగా ముద్ర పడ్డవారే. రాష్ట్ర విభజన సమయంలో అధిష్టానానికి అనుకూలంగా మాట్లాడిన, వ్యవహరించిన ప్రతీ ఒక్కరికీ తగిన విధంగా ప్రతిఫలం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ మ్యానిఫెస్టో కమిటీకి చైర్మన్ గా మాజీ మంత్రి ఆనం రామినారాయణ రెడ్డిని, కో-చైర్మన్ గా కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని నియమించింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్ గా కేంద్రమంత్రి చిరంజీవిని, కో-చైర్మన్ గా డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించింది.
తెలంగాణా మ్యానిఫెస్టో కమిటీకి చైర్మన్ గా మాజీ మంత్రి శ్రీధర్ బాబుని, కో-చైర్మన్ గాభట్టి విక్రమార్కను నియమించింది.
తెలంగాణా ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్ గా దామోదర రాజనరసింహను, కో-చైర్మన్ గాషబ్బీర్ ఆలీని నియమించింది.