మేం నిషేధించలేదు.. వాళ్లే ఎత్తేశారు!
posted on May 17, 2023 @ 10:08AM
దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ది కేరళ స్టోరీ చిత్రాన్ని పలు రాష్ట్రాలు ప్రదర్శించనీయకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తమిళనాడు, బెంగాల్ ప్రభుత్వాలు తమ చిత్రాన్ని నిషేధించడాన్ని వారు సవాల్ చేశారు. అయితే దీనిపై స్పందిస్తూ సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం చేసిన వాదన ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని తాము నిషేధించలేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
ది కేరళ స్టోరీ చిత్రాన్ని తాము తమిళనాడులో నిషేధించలేదని, పేలవ స్పందన కారణంగా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు ఆ సినిమాను ప్రదర్శించకుండా ఎత్తేశాయని స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టుకు తెలిపింది. సినిమాలో పెద్ద స్టార్లెవరూ లేకపోవడం, పేలవ స్పందన కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని వెల్లడించింది. బాక్సాఫీస్ కలెక్షన్లు లేకుండా సినిమాను థియేటర్లు మాత్రం ఎలా ఆడిస్తాయని ప్రభుత్వం ప్రశ్నించింది.
ది కేరళ స్టోరీ సినిమా విడుదలైన రెండు రోజుల్లో ప్రేక్షకుల స్పందన సరిగా లేకపోవడంతో ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల యజమానులు నిర్ణయించుకుంటే తాము మాత్రం ఏం చేస్తామని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మల్టీప్లెక్స్ యజమానులు సినిమాపై వచ్చిన విమర్శలు, ప్రముఖ నటులు లేకపోవడంతో కలెక్షన్లు లేక మే 7 నుండి సినిమా ప్రదర్శనను నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
తమిళనాడులో హిందీలో ఈ చిత్రం 19 మల్టీప్లెక్స్‌లలో మే 5న విడుదలైంది. సినిమాను ఉపసంహరించుకోవాలన్న థియేటర్ల యాజమాన్యాల నిర్ణయంపై ఎలాంటి నియంత్రణ లేదని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. మే 5న సినిమా విడుదలపై ప్రభుత్వం అప్రకటిత నిషేధం విధిస్తోందని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా చిత్రనిర్మాతలు సినిమాకు ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నారని స్టాలిన్ సర్కార్ ఆరోపించింది. తద్వారా సుప్రీంకోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. తమిళనాడు ప్రభుత్వం సినిమాని నిషేధించిందన్న ఆరోపణకు మద్దతుగా నిర్మాతలు ఒక్క చిన్న రుజువును కూడా సమర్పించలేదని అదనపు డీజీ గుర్తుచేశారు.
ది కేరళ స్టోరీ ని విదేశాలలో నిషేధించారు. ఇది ఫేక్ స్టోరీ అని, గొడవలకు దారి తీసేదిగా ఉందంటూ పలు దేశాలు సిన్మాను తమ దేశంలో విడుదల కాకుండా నిషేధించాయి. ఒక వర్గాన్ని కించపరిచే విధంగా సిన్మా ఉందని.. ఈ సిన్మాతో బీజేపీ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.