వివేకా హత్యకేసు.. సీబీఐ దర్యాప్తులో వేగం!
posted on May 17, 2023 @ 10:26AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత బబాయ్ వివేకా హత్య కేసు దర్యాప్తులో గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్నట్లు కనిపించిన సీబీఐ అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఆ క్రమంలో మంగళవారం పులివెందుల్లోని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి కారు డ్రైవర్‌కు నోటీసులు అందించినట్లు సమచారం. మరో వైపు మే 16వ తేదీ హైదరాబాద్ కోఠిలోని తమ కార్యాలయానికి రావాలని సోమవారం అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు వాట్సప్‌లో నోటీసులు పంపారు.
దీంతో మంగళవారం సీబీఐ విచారణకు ఆయన హాజరవుతారని అంతా భావించారు. కానీ తనకు ముందుగా షెడ్యూల్ చేసుకున్న పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని.. తనకు విచారణకు హాజరయ్యేందుకు నాలుగు రోజుల గడువు కావాలని సీబీఐ అధికారులను ఆయన కోరారు. తొలుత అందుకు నిరాకరించిన సీబీఐ మళ్లీ ఏమనుకుందో ఏమో మే 19న గంటలకు విచారణకు హాజరుకావాలంటూ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ అంతలోనే మళ్లీ సీబీఐ అధికారులు .. పులివెందుల్లోని అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులు ఇవ్వడంపై ఉమ్మడి కడప జిల్లా వాసుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
మరోవైపు వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ... వివేకా రాసినట్లుగా చెబుతున్న లేఖను ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి దాచిపెట్టమన్నారంటూ పలు సందేహాలు వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో సదరు లేఖపై సీబీఐ ప్రస్తుతం దృష్టి సారించింది. ఆ క్రమంలో సదరు లేఖపై వేలిముద్రలు ఎవరెవరివో శోధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగా ఆ వేలి ముద్రలు ఎవరివో గుర్తించేందుకు నిన్ హైడ్రేట్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు, నిందితుల అభిప్రాయాలను కోరింది. దీంతో జూన్ 2వ తేదీన ఈ అంశంపై విచారించే అవకాశం ఉందని సమాచారం.
అయితే వైయస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఇక అనివార్యమనే ఓ చర్చ సైతం ఉమ్మడి కడప జిల్లాలో నడుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ వెంటనే వైయస్ అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అయిపోతారని అంతా భావించారు. చివరకు తాను కూడా అరెస్ట్ అయిపోతానని గ్రహించిన అవినాష్ రెడ్డి.. ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.
అలాంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి.. తమదైన శైలిలో అటు అవినాష్ రెడ్డి, ఇటు ఆయన తండ్రి వైయస్ భాసరరెడ్డి, ఇంకోవైపు ఈ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పాత్రధారులందరినీ విచారించి.. ఈ హత్య కేసు విచారణకు ముగింపు పలికే దిశగా సీబీఐ అడుగులు వేస్తోందనే చర్చ సైతం ఉమ్మడి కడప జిల్లాలో కొన... సాగుతోంది.