Read more!

'కృష్ణ వ్రింద విహారి' హీరోయిన్ 'పైజ‌మా పాప్‌స్టార్' అని మీకు తెలుసా!

 

'కృష్ణ వ్రింద విహారి' మూవీలో హీరోయిన్ వ్రింద పాత్ర‌లో చ‌క్క‌ని న‌ట‌న ప్ర‌ద‌ర్శించి, ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ను, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందుతోంది షిర్లీ సేటియా. హీరో నాగ‌శౌర్య‌తో ఆమె ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ కూడా జ‌నానికి బాగా న‌చ్చేసింది. హీరోతో స‌మానంగా తొలి సినిమాలోనే స్క్రీన్ స్పేస్ పొంది, త‌న అంద‌చందాలు, అభిన‌యంతో అల‌రించిందామె. ఇంత‌కీ షిర్లీ సేటియా ఎవ‌రు? ఆమె కేవ‌లం న‌టి మాత్ర‌మే కాదు, డాన్స‌ర్‌, రేడియో జాకీ, సింగ‌ర్‌, యూట్యూబ‌ర్ కూడా! ఇండియాలో పుట్టిన‌ప్ప‌టికీ, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో పెరిగి, అక్క‌డే చ‌దువుకుంది. న‌టి కావ‌డానికి ముందుగానే భార‌తీయ సినిమా పాట‌ల‌ను ఆల‌పిస్తూ ల‌క్ష‌లాది శ్రోత‌ల్ని త‌న స్వ‌రంతో అల‌రిస్తూ వ‌చ్చింది.

హ‌ర్యానాకు చెందిన రాజ్‌, ఫిరోజా సేటియా దంప‌తుల‌కు జ‌న్మించింది షిర్లీ. ఆమె ఇండియాలోనే పుట్టింది. తండ్రి రాజ్ వ్యాపార రీత్యా ఆక్లాండ్‌లో స్థిర‌ప‌డ‌టంతో షిర్లీ కూడా అక్క‌డే పెరిగింది. ఆమెకు షానే అనే త‌మ్ముడు కూడా ఉన్నాడు. స్కూలు చ‌దువు త‌ర్వాత మార్కెటింగ్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్‌లో బీకామ్ చేసింది షిర్లీ. డిగ్రీ అయ్యాక ఆక్లాండ్‌లో హిందీ కంటెంట్‌ను ప్రసారం చేసే రేడియో టరానాలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగంలో చేరి, పాపులర్‌ షో ‘షోటైమ్‌ విత్ షిర్లీ’కు ఆర్జేగా పనిచేసింది. 

సింగ‌ర్‌గా త‌ను మెరుగ‌య్యాన‌నే న‌మ్మ‌కం కుదిరాక, 2012లో 'షిర్లీ సేటియా' పేరుతో యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించింది. ఆమె అప్‌లోడ్‌ చేసే పాటలకు మంచి స్పందన వచ్చేది. చిన్నప్పటి నుంచి బాలీవుడ్‌ పాటలు వింటూ పెరగడంతో, భారతీయ సంగీతంపై పట్టు ఏర్పడింది. దాంతో బాలీవుడ్‌ సినిమా పాటలు పాడి వాటిని తన చానల్‌లో అప్‌లోడ్‌ చేసేది. ఏడాది తరువాత టి-సిరీస్‌ ఏర్పాటు చేసిన యూట్యూబ్‌ కాంపిటిషన్‌లో పాల్గొంది. 'ఆషికీ 2' మూవీలో అర్జిత్‌ సింగ్‌ పాడిన ‘‘హమ్‌ తేరే బిన్‌ అబ్ రహా నహీ సక్‌తే’’ కవర్‌ సాంగ్‌ వీడియోను రికార్డు చేసి తన చానల్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఈ పాట బాగా వైరల్‌ అవడంతో టి-సిరీస్‌ పోటీలో విజేతగా నిలిచి, అధిక సంఖ్యలో వ్యూస్‌ను సంపాదించుకుంది. 
 
పాపులారిటీ తెచ్చిన "హమ్‌ తేరే" పాట వీడియో రూపొందించేటప్పుడు పైజమా ఉన్న డ్రెస్‌ ధరించి పాడింది షిర్లీ. ఆ పాటతో బాగా పాపులర్‌ అవడంతో.. న్యూజిలాండ్‌ హెరాల్డ్‌ ‘పైజమా పాప్‌స్టార్‌’గా షిర్లీను అభివర్ణించింది. అప్పటినుంచి ఆమె పైజమా స్టార్‌గా పాపులర్‌ అయ్యింది.  దాంతో సబ్‌స్కైబ్రర్స్‌ సంఖ్య కూడా బాగా పెరిగింది. 

2017లో బాలీవుడ్‌ సినిమా ‘ఎ జెంటిల్‌మేన్‌’లో ‘‘డిస్కో డిస్కో’’ పాడింది. ఈ పాటకు 70 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఇదే ఏడాది తన సొంత పాటలు పాడాలని నిర్ణయించుకుని, టీమ్‌తో కలిసి పంజాబీ ట్రాక్‌ ‘కోయ్‌ వి నహీ’ సాంగ్‌ను విడుదల చేసింది. ఇది యూట్యూబ్‌లో రికార్డులను బద్దలు కొట్టి 150 మిలియ‌న్‌కు పైగా వ్యూస్ సాధించింది. అలా యూఎస్, యూకే, ఇండియా, కెనడాలలోని యూట్యూబ్ ఆర్టిస్టుల‌తో కలిసి పాటలు పాడేది. 

2020లో బాలీవుడ్ మూవీ ‘మస్కా’తో న‌టిగా మారింది షిర్లీ. ఈ ఏడాది జూన్‌లో వ‌చ్చిన‌ ‘నిక‌మ్మా’ సినిమాలో అభిమ‌న్యు ద‌స్సాని (న‌టి భాగ్య‌శ్రీ కొడుకు) స‌ర‌స‌న నాయిక‌గా న‌టించి, గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా చేసేట‌ప్పుడు కృష్ణ వ్రింద విహారి మూవీలో నాయిక‌గా ఆమెకు చాన్స్ వ‌చ్చింది. న‌ట‌న‌కు అవ‌కాశం ఉన్న పాత్ర కావ‌డం, క‌థ‌కు కీల‌క‌మైంది కావ‌డంతో వెంటనే అంగీక‌రించింది. ఫ‌లితం.. ఇప్పుడు ప్రేక్ష‌కుల అభిమానాన్ని పొంద‌డ‌మే కాకుండా, ప‌లువురు ఫిల్మ్‌మేక‌ర్స్ దృష్టిలో ప‌డింది.  

ప్రస్తుతం షిర్లీ యూట్యూబ్‌ చానల్‌కు దాదాపు 38 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉండగా, ఆమె ఇన్‌స్టాగామ్‌ ఫాలోవర్స్‌ డెబ్భై నాలుగు లక్షల మందికి పైగా ఉన్నారు.