Read more!

అమ్మతో మహేష్ బాబు అనుబంధం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'నాని' చిత్రంలోని "పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ" పాటలో లాగా తల్లి ఇందిరాదేవితో మహేష్ కి మంచి అనుబంధం ఉండేది. ఆమెని నిజంగానే ఓ దేవతలా భావించేవాడు. ఆయన ఎంతో ప్రాణంగా ప్రేమించే తన తల్లి అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

 

 

హీరోగా మహేష్ పెద్ద స్టార్ అయినప్పటికీ తన తల్లి ప్రస్తావన రాగానే చిన్న పిల్లాడిలా మారిపోతాడు. చిన్నప్పటి నుంచి ఆయనకు అమ్మ అంటే ఎనలేని ప్రేమ. ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అప్పటికే టాప్ స్టార్ కావడంతో పాటు విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకోవడంతో.. ఎక్కువగా తల్లి చాటు బిడ్డలా పెరిగాడు మహేష్. బాల్యం ఎక్కువగా అమ్మ, అమ్మమ్మతోనే గడిపాడు. ఇప్పుడు తను సూపర్ స్టార్ అయినా, పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. తల్లి గురించి మాట్లాడుతూ చిన్న పిల్లాడిలా ఎమోషనల్ అయిపోతాడు.

 

 

అమ్మకి చాలా ఓపిక ఎక్కువని, అసలు ఆమె మాపై కోప్పడేవారే కాదని మహేష్ గతంలో చెప్పాడు. ఆమెకు గుండె ధైర్యం ఎక్కువని, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడగలరని తెలిపాడు. అమ్మ అంటే తనకు దేవత అని, ఇప్పటికీ ఒత్తిడి అనిపిస్తే వెంటనే అమ్మ దగ్గరకు వెళ్లి ఆమె చేతి కాఫీ తాగుతానని, దాంతో టెన్షన్స్ అన్నీ ఎగిరిపోతాయని మహేష్ చెప్పేవాడు.

 

 

'ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే' అన్నట్టుగా అమ్మతో మహేష్ అనుబంధం ఉండేది. ఆమెతో కలిసి ఏదైనా వేడుకకు హాజరైతే ఆమె చెయ్యి పట్టుకొని నడిపించేవాడు. ఆమె పక్కనే ఉంటూ జాగ్రత్తగా చూసుకునేవాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా వీలు చూసుకొని మరీ అమ్మతో గడిపేవాడు. ఆమె పుట్టిన రోజు వేడుకకు దగ్గరనుండి జరిపించేవాడు. ఇందిరాదేవి పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 20న మహేష్ చేసిన ట్వీట్ మనసుకి హత్తుకునేలా ఉంది. "మీరు నా తల్లి కావడం నా అదృష్టం. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అమ్మ" అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. చిన్నతనం నుంచి మహేష్ ఎంతో ప్రాణంగా ప్రేమించే తల్లి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో తనకి ఎంతో ఇష్టమైన సోదరుడు రమేష్ బాబుని దూరం చేసుకున్న మహేష్ కి.. కొద్ది నెలలకే తల్లి దూరమవ్వడం విచారకరం.