ఓటమి భయంతో ధర్మాన నోట ఉత్తరాంధ్ర ఉద్యమం
posted on Dec 31, 2022 @ 11:16AM
అధికార దాహం తలకెక్కితే, ఏమి జరుగుతుందో అనేక వేర్పాటువాద ఉద్యమాలు నిరూపించాయి. అందుకు కళ్ళ ముందు కనిపిస్తున్నసాక్ష్యం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. నిజానికి తెలంగాణ ఉద్యమం ప్రధానంగా ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిందే అయినా, చివరకు రాజకీయ అవతారం ఎత్తిన తర్వాత, ముఖ్యంగా రాష్త్రం ఏర్పడిన తర్వాత ఏమి జరిగిందో, ఏమి జరుగుతోందో ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపిస్తోంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుష్కరకాలం పైగా జరిగిన మలి దశ ఉద్యమంలోనే 1200 మందికి పైగా యువతీ, యువకులు ప్రాణ త్యాగం చేశారు. అమర వీరులయ్యారు. కానీ, అంత మంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం,ఇప్పడు ఎట్లుంది .. అంటే .. అమర వీరుల ఆశయాలను ఏ మేరకు నిజం చేసింది? అంటే ... అమరుల అత్మఘోషే సమాధానం అవుతుంది. నిజమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఏవో కొన్ని మేళ్ళు జరిగింది నిజమే కావచ్చును, అయినా ఇందుకేనా త్యాగాలు చేసింది? ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది అనే నిర్వేదం మాత్రం సర్వత్రా ప్రతిధ్వనిస్తోంది.
ఇక అవశేష ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ బేహారులు మరో ప్రాంతీయ ఆందోళన తెర తీస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలమాట వినిపిస్తున్న సమయంలో రాజకీయ బేహారులు రంగ ప్రవేశం చేశారు. మూడు రాజధానుల వివాదాన్ని తెరమీదకు తెచ్చి, ప్రాంతీయ విద్వేషాలను, సెంటిమెంట్లను రెచ్చగొట్టే ప్రయత్నం మొదలైంది. ఇంకా చిత్రం ఏమంటే, ఆ రెచ్చగొట్టే ప్రయత్నానికి శ్రీకారం చుట్టిందే వైసీపీ కావడం. నిజమే మూడు రాజధానుల పేరిట ప్రాతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతున్నా, ఇప్పుడు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ ను తెర మీదకు తెచ్చారు.అమరావతినే రాజధాని అని చంద్రబాబు అంటున్నారని.. అలా అయితే మా విశాఖను మాకిచ్చేయాలని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటామని ఆయన ప్రకటించేశారు.
ఎచ్చెర్లలో వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబు ఇటీవలి పర్యటనలో.. ఒకే రాజధాని అమరావతి ఉండాలని ప్రజలతో నినాదాలు చేయించిన అంశాన్ని గుర్తు చేసుకుని ఆవేశాన్ని అభినయించారు. ఉత్తరాంధ్ర పర్యటనలోనే అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు చెప్పడం మన చేతులతో మన కళ్ళని పొడిచే ప్రయత్నమని ధర్మాన అభివర్ణించారు. అయితే ఇది ధర్మాన వ్యక్తిగత అభిప్రాయమా? వైసేపీ విధానమా? అనేది స్పష్టం కావలసి ఉంది.
అయితే, మూడు రాజధానుల విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని గమనిస్తే, ప్రజలలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొట్టి పబ్బం గడుపుకునే వ్యూహం దాగుందనేది కాదన లేని నిజం. అందుకే ఇది ధర్మాన సొంత అభిప్రాయం, అయినా, జగన్ రెడ్డి వ్యూహమే అయినా, ఇప్పటికే రాష్ట్ర విభజనతో అన్ని విధాల నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి అనర్ధమే అవుతుందని విజ్ఞులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా ఒక సారి ప్రాతీయ విద్వేషాగ్ని రాజుకుంటే, ఆర్పడం అంత తేలిగ్గా అయ్యే పని కాదని, అందుకు మళ్ళీ తెలంగాణనే కళ్ళముందున్న ప్రత్యక్ష సాక్ష్యమని అంటున్నారు. పన్నెండేళ్ల అశాంతి అలజడి, పన్నెండు వందల ప్రాణాలు బలి, చివరకు మిగిలింది అదే రాజకీయ అరాచకం అని గుర్తు చేస్తున్నారు.
అదలా ఉంటే, ధర్మాన ప్రసాద్ రావు .. రాజకీయ ప్రయోజనాల కోసం అగ్గిరాజేస్తున్నారని ప్రజలు, ప్రజాసంఘాలు మేథావులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. నిజానికి, ఒకప్పుడు, మూడు రాజధానుల ఆలోచను ధర్మాన చాలా గట్టిగా వ్యతిరేకించారు. అమరావతి ఒక్కటే రాజధాని అనే విధానాన్ని, ‘ఏకైక రాజధాని . .. అమరావతి’ నినాదాన్ని గట్టిగా సమర్ధించారు. కానీ ఇప్పడు అదే ధర్మాన రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదని అంటున్నారు. అయితే తెలంగాణ అనుభవం తర్వాత ప్రజలు మరో ప్రాంతీయ ఆందోళనను ఎట్టి పరిస్థితిలోనూ సమర్ధించరని అంటున్నారు.
ప్రస్తుతానికి అది నిజమే కావచ్చును కానీ, ముందు ముందు ఏమి జరుగుతుందో వేచి చూడవలసి ఉందని అంటున్నారు. మరో వంక ఓటమి భయంతోనే వైసీపీ, ప్రాంతీయ విద్వేషాలను రగిల్చే ప్రయత్నం చేస్తోందనే అంటున్నారు. గతంలో వైస్ రాజశేఖర్ రెడ్డి అధికారం కోసం హైదరాబాద్ లో మత కలహాలను రెచ్చగొడితే, ఇపుడు జగన్ రెడ్డి అధికారాన్ని నిలుపుకునేందుకు.. ప్రాతీయ తత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉందని అంటున్నారు.