మిషన్ 90 సక్సెస్ అవుతుందా?
posted on Dec 31, 2022 @ 12:14PM
మిషన్ 90 టైటిల్ బాగుంది. కానీ, కమల దళం నిర్దేశించుకున్న లక్ష్యం నెర వేరుతుందా? అంటే అదంత ఈజీ టాస్క్ కాదు. మరి అ విషయం కమలనాథులకు తెలియదా అంటే, తెలుసు. అయినా, మోడీ షా నాయకత్వంలో బీజేపీ ఎప్పుడు, ఎక్కడ నేల చూపులు చుడదు. తలెత్తి చూసే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటుంది తప్ప తల దించుకుని చూసే అలోచన కార్యకర్తలలో రానీయదు. అవును, బీజేపీ విధానాలను కమ్యూనిస్ట్ శంఖంలో పోసి విశ్లేషించే ఒక మేధావి, మాజీ ఎమ్మెల్సీ అన్నట్లుగా, మోడీ షా జోడీ నాయకత్వంలోని బీజేపీ, పులి మీద స్వారీ చేసేందుకు ఇష్టపడుతుందే కానీ పిల్లి మీద స్వారీ చేయదు.
పశ్చిమ బెంగాల్ లో జరిగింది అదే.. 200 ప్లస్ టార్గెట్ గా ఎన్నికల బరిలో దిగింది. కేంద్ర హోం మంత్రి అమిత షా, ఒకటికి వందసార్లు, బీజేపీ 200 సీట్ల మెజారిటీతో అధికారంలోకి వస్తుందని, వచ్చితీరాలని పార్టీ నాయకులు, కార్యకర్తల మెదళ్ల లో ఒక సెల్ఫ్ టార్గెట్ ను ఇంజెక్ట్ చేశారు. నిజమే,పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ప్రకటిత లక్ష్యాన్ని చేరుకోలేదు. కానీ అప్రకటిత లక్ష్యాన్ని చేరుకుంది.
కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేసినా, సింగిల్ సీటు రాలేదు. బీజేపీ ఫిక్స్ చేసుకున్న 200 టార్గెట్ ను కాదు, ప్రశాంత్ కిశోర్ విసిరిన 100 సీట్ల ఛాలెంజ్ ని చేరుకోలేక పోయింది. అయినా సింగిలే డిజిట్ నుంచి డబుల్ డిజిట్ కు చేరింది. 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదాను కైవసం చేసుకుంది. అంతకు ముందు 2016 ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది కేవలం 3 అసెంబ్లీ సీట్లు, ఆ ఎన్నికల్లో బీజేపీకి పోలైన ఓట్లు కేవలం 10.16 శాతం. అదే 2021కి వచ్చే సరికి, సీట్ల సంఖ్య 3 నుంచి 77కు పెరిగితే, ఓట్ల శాతం 10.16 నుంచి 38.13 శాతానికి చేరింది.
అలాగని పశ్చిమ బెంగాల్ స్టొరీనే తెలంగాణలో రీపీట్ అవుతుందా అంటే, కావచ్చు, కాకపోవచ్చును. కానీ, హైదరాబాద్ శివారులో జరిగిన బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గాల పాలక్, విస్తారక్, ప్రభారీ కన్వీనర్ల సమావేశంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని, సిద్దం చేసుకున్న రోడ్ మ్యాప్ ను సింపుల్ గా తీసి పారేయడం సరికాదని పరిశీలకులు భావిస్తున్నారు. అవును బీజేపీ హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్ట్ మేథావులు కూడా బీజేపీ సక్సెస్ అవుతుందా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే, తెలంగాణను కైవసం చేసుకునేందుకు బీజేపీ బెంగాల్ తరహా వ్యూహంతో పావులు కడుపుతోందని మాత్రం గట్టిగా నమ్ముతున్నారు.
ఈ వ్యూహంలో భాగంగా కొత్త ఏడాదిలో పది నెలల రోడ్ మ్యాప్ తో వరుస కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమవుతున్నది. పది నెలల రోడ్ మ్యాప్ లో మొదటి నాలుగు నెలలలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను జనంలో ఎండగట్టడంతోపాటు రాష్ట్రానికి కేంద్రం ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చిందో ప్రజలకు వివరించనుంది. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 5 వరకు ‘పల్లె గోస.. బీజేపీ భరోసా’ పేరుతో పది వేల గ్రామ సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఫిబ్రవరిలో ప్రధాని మోడీని హైదరాబాద్ కు ఆహ్వానించి, ఏడు లక్షల మంది బూత్ కమిటీ సభ్యులతో సమ్మేళనం నిర్వహించాలని భావిస్తున్నది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 5 వరకు అసెంబ్లీ స్థాయిలో ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహించేందుకు ప్రణాళికను రెడీ చేసుకుంది. వీటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను తీసుకురావాలనే ఆలోచనలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఏప్రిల్ లో చార్జిషీట్ విడుదల చేయాలనుకుంటున్నది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించి భారీ బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నది. హైదరాబాద్ శివారులో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పాలక్, విస్తారక్, ప్రభారీ, కన్వీనర్ల సమావేశంలో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ చేసిన దిశా నిర్దేశంతో నేతలు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉధృతంగా పోరాడాలని బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించామని పార్టీ ప్రకటించింది.
సో.. చివరకు ఏమి జరుగుతుంది అనేది పక్కన పెడితే, జాతీయ స్థాయిలో బీజేపీని ఢీ కొనేందుకు బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నది. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ను అష్టదిగ్బంధనం చేసి రాష్ట్రానికే పరిమితం చేసే వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతోంది. యాదృచ్చికమే కావచ్చును కానీ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో కేసీఆర్ టార్గెట్ చేసిన బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సారధ్యంలో బీజేపీ కేసీఆర్ హటావో .. తెలంగాణ బచావో వ్యూహరచన జరిగిందిని ఇకపై కూడా మిషన్ 90 కి కర్త, కర్మ, క్రియగా ఆయనే వ్యవహరిస్తారని అంటున్నారు.అంతేకాదు, బీఎల్ సతోష్ హైదరాబాద్ నడిగడ్డ నుంచే కేసీఆర్ కు సవాలు విసిరి వెళ్ళారు. సో.. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ యుద్ధం ముందు ముందు మరింతగా రక్తి కడుతుందని, రసవత్తరంగా మారుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.