జీతాలడిగితే శత్రువులేనా? జగన్ సర్కార్ పై ఉద్యోగులు ఫైర్
posted on Dec 31, 2022 @ 10:59AM
ఆడ లేక మద్దెలు ఓడు అన్నట్లు తయారైంది ఏపీలో జగన్ సర్కార్ పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, విధ్వంసక పాలన, అన్నిటినీ మించి ఆర్థిక అరాచకత్వం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగా రాష్ట్రం దివాళా అంచుకు చేరింది.
ఇంత కాలం అప్పులు చేసి పబ్బం గడుపుకున్న జగన్ సర్కార్ కు రానున్న మూడు నెలల కాలం.. అంటే బడ్జెట్ వరకూ చిల్లు కానీ కూడా ఖర్చు చేయడానికి సొమ్ములు లేని పరిస్థితిలో ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కాదు కదా, రోజువారీ ఖర్చులకు కూడా ఖజానాలో సొమ్ములు లేని పరిస్థితి. ఈ పరిస్థితి ఎదురు కావడానికి జగన్ సర్కార్ విధానాలే కారణమనడంలో సందేహం లేదు. అయినా వాస్తవాలను దాచి పెట్టి మసిపూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నిస్తోంది.
సమయానికి జీతాలందని ఉపాధ్యాయుులు వేతనాలెప్పుడని నిలదీస్తుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వేతనాలివ్వండి అని ఉద్యోగులు అడుగుతుంటే.. ప్రభుత్వం మాత్రం అలా అడిగినందుకు ఉద్యోగులపై కారాలూ మిరియాలూ నూరుతోంది. అసలు వారి పొడే గిట్టదన్నట్లుగా వ్యవహరిస్తోంది. వారికి ఇవ్వాల్సిన రాయితీలు, అలవెన్నుల మాట దేవుడెరుగు జీతాల కోసమే దేబిరించాల్సిన పరిస్థి కల్పించింది. అక్కడితో ఆగకుండా వేతనాలు అడిగినందుకు ఎదురు అసలు మీరు పని చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తోంది.
సమయపాలన ఏదీ అంటూ నిలదీస్తోంది. జనవరి 1నుంచి ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ కు అమలు చేస్తోంది. తన తప్పు కప్పిపుచ్చుకుని ఎదురు ఉద్యోగులను పని చేయకుండా జీతాలు తీసుకుం టున్నారన్నట్లుగా మీరు ఏ రోజు సమయానికి వచ్చారని నిందలేస్తోంది. ఈ ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్సు ను ఉద్యోగులు తమ ఫోన్లలో యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. పది నిముషాలు ఆలస్యమైనా గైర్హాజరుగా పరిగణించి వేతనాలు కట్ చేస్తామనిన హెచ్చరిస్తోంది. పది నిముషాలు ఆలస్యం చేస్తే ప్రభుత్వం జీతం కట్ చేస్తుంది సరే.. మరి వేతనం ఆలస్యంగా ఇస్తున్న ప్రభుత్వానికి ఏం కట్ చేయాలన్న ప్రశ్న ఎదురౌతోంది. పవర్ కట్ చేయడమొక్కటే మార్గమని అధిక శాతం మంది ఉద్యోగులు అంటున్నారు. హాజరు విషయంలో ఇంత కచ్చితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మరి వేతనాలు ఇచ్చే విషయంలో ఎందుకు అంత కచ్చితంగా ఉండటం లేదని ఉద్యోగులు అంటున్నారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొదటి నుంచీ కక్ష పూరితంగనే వ్యవహరిస్తోంది. వేతనాలు జాప్యం, పీఎఫ్ తదితర ప్రయోజనాల విషయంలోనూ అలసత్వం, ఏకంగా ఉద్యోగుల పీఎఫ్ ను వాడేసుకుని తిరిగి ఇవ్వకపోవడం వంటి చర్యలతో ప్రభుత్వం ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోంది. తమ హక్కుల పరిరక్షణ కోసం, వేతనాల కోసం ఉద్యమిస్తే కేసులు పెట్టివేయడం, అణచివేతకు గురి చేయడం వంటి చర్యలతో దమనకాండకు తెగపడుతోంది.
సమస్యలు పరిష్కరించడం మాట అటుంచి వారిపై ఒత్తిడి పెంచి ఆందోళనకు గురి చేస్తోంది. ప్రభుత్వ తీరు మారకుంటే సంక్రాంతి తరువాత నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. హక్కుల పరిరక్షణ కోసం తగ్గేదేలే అని ఉద్యోగులు అంటున్నారు. ముందు ముందు ప్రభుత్వం ఉద్యోగుల మధ్య అగాధం మరింత పెరగడం తథ్యమని పరిశీలకులు అంటున్నారు. ఉద్యోగులు సహాయ నిరాకరణకు దిగితే ప్రభుత్వానికి చిక్కులు తప్పవంటున్నారు.