ఢిల్లీలో కాంగ్రెస్ కీ షాక్ ఇచ్చిన బిజెపి
posted on Apr 18, 2012 @ 10:08AM
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కీ బిజెపి షాక్ ఇచ్చింది. అధికార బీజేపీని ఎలాగైనా ఓడించేందుకు.. గత 53 ఏళ్లుగా ఒకే మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉన్న ఎంసీడీని ఉత్తర, దక్షిణ, తూర్పు కార్పొరేషన్లుగా విభజిస్తూ తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా రెండోసారి జయకేతనం ఎగరేసింది.
అయితే బిజెపికి గతంతో పోలిస్తే కొన్ని సీట్లు తగ్గినా మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లోనూ బిజెపియే తన హవా కొనసాగించింది. ఢిల్లీ ఉత్తరం, ఢిల్లీ తూర్పు కార్పొరేషన్లలో పూర్తి మెజారిటీ సాధించగా ఢిల్లీ దక్షిణం కార్పొరేషన్లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. మూడు కార్పొరేషన్లలోనూ మొత్తం 272 వార్డులు ఉన్నాయి. వీటిలో బిజెపి 138 చోట్ల విజయం సాధిస్తే కాంగ్రెస్ 78 స్థానాలను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి జగ్ రోషిణి బేగంపూర్ వార్డు నుంచి అత్యధికంగా 17,284 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
ఇక, సత్వీందర్ కౌర్ సిర్సా కూడా 11,584 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమె కోటీశ్వరురాలు. ఎన్నికల అఫిడవిట్‌లోనే తన ఆస్తి రూ.112 కోట్లు అని ఆమె ప్రకటించారు. అవినీతి కాంగ్రెస్‌కు తామే అసలైన ప్రత్యామ్నాయమని ప్రజలు భావించారని, ఈ ఎన్నికలు దేశ రాజధానిలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలకు నిదర్శనమని బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ చెప్పారు. అవినీతి, అధిక ధరలు, కాంగ్రెస్ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వెలువడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.