బందరుకు దూరం కానున్న బెల్?
posted on Apr 18, 2012 @ 11:14AM
సముద్రతీర ప్రాంతాన ఉన్న బందరు పట్టణం బ్రిటిషు హయాంలో ఒక వెలుగు వెలిగింది. అప్పట్లో అక్కడ నిత్యం రద్దీగా ఉండే నౌకాశ్రయం ఉండేది. బందరు నుంచి గోవా వరకూ రైలు మార్గం ఉండేది. అటువంటి చారిత్రాత్మక బందరు పట్టణం క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతుంది. ఇక్కడ ఎప్పుడో ఏర్పాటు చేసిన భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (బెల్) కూడా ఇక్కడ నుంచి తరలిపోయే పరిస్థితి ఏర్పడింది. బెల్ కంపెనీలో భారతసైన్యానికి ఉపయోగపడే నైట్ విజన్, గాగుల్, టెలిస్కోప్, రాడార్లు వంటి పరికరాలను తయారుచేస్తున్నారు. అయితే దీనిని విస్తరించాలన్న నెపంతో గన్నవరం ఎయిర్ పోర్టు సమీపానికి దీన్ని తరలించాలను కుంటున్నారు. బందరుకు ఉన్న ఈ ఒకే ఒక్క కేంద్రప్రభుత్వ యూనిట్ ను ఇక్కడనుంచి తలలిస్తే ఈ పట్టణం ప్రభావం మరింత దిగజారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి బెల్ యూనిట్ ను బందరు నుంచి తరలించవలసిన అవసరం ఏమాత్రం లేదని అధికారులు కేవలం తమ సౌకర్యం కోసమే ఈ ప్రతిపాదన చేశారని వారు ఆరోపించారు. ఎయిర్ పోర్టుకు దగ్గరగా బెల్ యూనిట్ ఉంటే అధికారుల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందన్న ఒకే ఒక్క సాకుతోనే దీనిని తరలించాలనుకుంటున్నారని రాజకీయనాయకులు కూడా విమర్శిస్తున్నారు. బందరు పార్లమెంటు సభ్యుడు కె.నారాయణ, బందరు శాసనసభ్యుడు పేర్ని నాని కూడా బెల్ తరలింపు యత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు. బెల్ విస్తరణకు అవసరమైన 30 ఎకరాల స్థలాన్ని తాము సుల్తానగరం, ఎస్.ఎస్.గొల్లపాలెం లలో మంజూరు చేయిస్తామని వారు అంటున్నారు. అయినా బెల్ కంపెనీ అధికారులు దీనిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.