బాబర్ , కెప్టెన్సీ రాకుంటే దిగిపో... సలీంమాలిక్
posted on Oct 26, 2022 @ 10:28AM
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో సూపర్12కి చేరుకున్న పాకిస్తాన్, భారత్ మొన్న ఆాదివారం తలపడిన సంగతి తెలిసిందే. అందులో ఊహించనివిధంగా భారత్ సూపర్ స్టార్ కింగ్ కోహ్లీ ఒక్కడే వీరోచిత బ్యాటింగ్ ప్రధర్శనతో భారత్ చివరి ఓవర్లో గెలిచిన సంగతి తెలిసిందే. కాగా గెలవాల్సిన మ్యాచ్ ని భారత్ కు అలా అప్పగించావని పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ పై పాకిస్తాన్ మాజీలు మండిపడుతున్నారు. కెప్టెన్సీ రాకుంటే వదిలేయమని సలీం మాలిక్ వంటి మాజీలు సూచించారు.
అసలు కెప్టెన్ గా జట్టును అవసరమై సమయంలో ధైర్యాన్నిస్తూ ముందుకు నడపడంలో ఘోరంగా విఫలమయ్యావంటూ బాబర్ అజామ్ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ మండిపడ్డాడు. 160 పరుగుల టార్గెట్ భారత్ అవలీలగా కొట్టేయగలదు. అయినా మంచి అవకాశం వచ్చినపుడు దాన్ని అనుకూలం చేసుకోలేకపోవడమేమిటని మాలిక్ ప్రశ్నించాడు. బౌలర్లను ఉత్సాహపరచకపోవడమే దారుణమన్నాడు. అసలు ప్రపంచకప్ పోటీకి సారధ్యం వహించే సత్తా ఏమాత్రం ప్రదర్శించలేదని, నాయకత్వం చేపట్టలేనపుడు తప్పుకోవడమే మేలని మాలిక్ సూచన చేశాడు.
బౌలింగ్, బ్యాటింగ్ పరంగానూ కెప్టెన్ విఫలం కావడంతోపాటు కనీసం జట్టును గెలిచే దిశలో ఉత్సాహ పరచక చతికిలపడ్డాడని ఇప్పటికే అతని మీద మీడియా కూడా విరుచుకుపడుతోంది. ఎంతో పోటా పోటీగా జరిగిన మ్యాచ్ లో చివరి దశలో పేలవ ప్రదర్శన పాక్ అభిమానులను దెబ్బతీసింది. దీనికి తోడు కింగ్ కోహ్లీని నిలువరించలేకపోవడం పాక్ బౌలింగ్ స్థాయిని మరోసారి బయటపెట్టింది. వారి సూపర్ స్టార్ యువ పేసర్ అఫ్రిదీ కూడా ఏమాత్రం ప్రభావం చూపకపోవడమే జట్టును, పాక్ అభిమాను లను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది.
ఎంతో ఉత్కంఠభరితంగా జరిగన మ్యాచ్ లో కోహ్లీ ఎంతో సమయస్పూర్తితో ఆడుతూ, ఎంతో సహనం ప్రదర్శిస్తూ ఆడాడని పాక్ జట్టు ప్రశంసించింది. అయితే మరో వంక బాబర్ అజామ్ కెప్టెన్ గా ఒత్తిడిని అధిగమించే మార్గాన్ని పట్టుకోలేకపోయాడని, తప్పుడు నిర్ణయాలతో గెలవాల్సిన మ్యాచ్ ని వదిలేయ డమేమిటని మాలిక్ మండిపడ్డాడు. యువ ప్లేయర్ వి సమర్ధుడవని కెప్టెన్సీ ఇచ్చారు, సీనియర్లు లేక కాదని, అయినా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం దారుణమ న్నాడు. దీనికంటే జట్టు నాయకత్వం వదులుకోవడమే మేలని సలీం మాలిక్ సూచించాడు.