పనిమనిషి, డైలీ లేబర్ మహిళకు బీజేపీ ఎమ్మెల్యే టికెట్లు
posted on Mar 23, 2021 @ 10:34AM
దేశవ్యాప్తంగా హాట్ హాట్ గా మారిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అందరికి షాకిచ్చింది. బుద్వాన్ జిల్లా అస్‌గ్రామ్ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి ఓ పని మనిషిని తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. కలితా మాజీ అనే పని మనిషిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడంతో స్థానిక బీజేపీ కార్యకర్తలే ఆశ్చర్యపోయారు. కలితా ఎవరు? అంటూ సందేహంలో పడిపోయారు.
అయితే బీజేపీ టికెట్ సాధించిన కలిత.. ప్రచారంలో మాత్రం దూసుకుపోతున్నారు.నెల రోజులపాటు తన పనికి సెలవు పెట్టి, ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కలితా భర్త సుబ్రతా మాజీ.. ఓ ప్లంబర్. పేదరికం కారణంగా ఆమె చదువుకోలేదు. ప్రచారంలో నేరుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఆమె టార్గెట్ చేస్తున్నారు. ఆట ఆడదాం అని ఎన్నికల ప్రచారంలో దీదీ చేస్తున్న నినాదాన్ని ఉద్దేశించి... ‘‘మోకాలి గాయంతో ఎన్నికల ఆటను మమత ఎలా ఆడతారు’’ అంటూ వ్యంగ్యాస్తాల్రు సంధించారు.
బీజేపీ మరో అసెంబ్లీ స్థానంలో రోజువారి కూలీ చేసుకునే మహిళను రంగంలోకి దిపింది. బంకురా జిల్లాలోని సల్ తోరా స్థానాన్ని చంద్ర బౌరికి కేటాయించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చంద్ర బౌరీనే పేదరాలు. ఆమె భర్త కూడా రోజువారీ కూలీనే. రోజుకు 4 వందల రూపాయలు సంపాదిస్తూ జీవనం గడుపుతున్నారు. కూలీ పనుల్లో భర్తకు సాయం ఉంటోంది చంద్ర బౌరీ. ఆమె జిల్లా బీజేపీలో యాక్టివ్ కార్యకర్త కావడంతో టికెట్ ఇచ్చినట్లు బీజేపీ నేతలు చెప్పారు.