వైసీపీకి షాక్ తెలుగుదేశం గూటికి యార్లగడ్డ.. ముహూర్తం ఖరారు?
posted on Aug 12, 2023 @ 5:32PM
వైసీపీకి జిల్లాల వారీగా నేతలు షాకులిస్తున్నారు. ఇప్పటికే బహిష్కృత ఎమ్మెల్యేలు గంపగుత్తగా టీడీపీ జెండా కిందకి వెళ్తుంటే మొన్న ఉత్తరాంధ్ర నుండి విశాఖ జిల్లా అధ్యక్షుడే పార్టీకి గుడ్ బై చెప్పేశాడు. ఇక ఇప్పుడు రాష్ట్రంలోనే కీలకమైన ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి మరో షాక్ సిద్దమవుతున్నది. రాజధాని అమరావతికి అటు కృష్ణా, ఇటు గుంటూరు ఉమ్మడి జిల్లాలు ఈసారి ఎన్నికలకు ఎంతో కీలకం అన్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల పుణ్యమా అని ఈ రెండు ఉమ్మడి జిల్లాలలో ఈసారి వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్నది ఎప్పటి నుండో రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రెండు జిల్లాలో చాలా మంది నేతలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఇలాంటి వారందరికీ ఇప్పుడు గన్నవరం వైసీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు దారి చూపించేలా ఉన్నారు. యార్లగడ్డ వైసీపీని వీడి సైకిలెక్కేందుకు సిద్దమైనట్లు ఇక్కడ రాజకీయ వర్గాలు గట్టిగా చెప్తున్నారు.
నిజానికి చాలా కాలంగా యార్లగడ్డ పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఆయన పార్టీ మారలేదు. వైసీపీ అధిష్టానం తనకు ఏదైనా హామీ ఇస్తుందేమో అని చాలాకాలంగా ఎదురు చూశారు. కానీ, అటు సీఎం జగన్ నుండి కానీ, వైసీపీ పెద్దల నుండి కానీ యార్లగడ్డ రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెలలోనే నారా లోకేష్ యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలో ఎంటర్ కాబోతుంది. దీంతో అప్పుడే యార్లగడ్డ టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు చెప్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రను దిగ్విజయం చేసి తన సత్తా చాటుకోవాలని యార్లగడ్డ సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇందుకు తగ్గట్లే తాజాగా యార్లగడ్డ తన అనుచరులతో ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని చర్చలు జరిపినట్లు తెలిసింది.
అమెరికాలో పలు బిజినెస్‌లు చేసే యార్లగడ్డని వైసీపీ పనిగట్టుకొని 2019 ఎన్నికల సమయంలో పార్టీలోకి తెచ్చుకుంది. అప్పుడు తెలుగుదేశం నుండి గన్నవరం బరిలో ఉన్న వల్లభనేని వంశీని ఓడించాలని యార్లగడ్డని గన్నవరం బరిలో నిలబెట్టి భారీగా ఖర్చు పెట్టించారు. కానీ తెలుగుదేశంకు గట్టి పట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలవలేకపోయింది. అయితే ఎన్నికలు అయ్యాక రెండు మూడు నెలలకే వంశీ టీడీపీని విడిచి వైసీపీ పంచన చేరారు. అధికారికంగా పార్టీ కండువా కప్పుకోకపోయినా వంశీ వైసీపీకి అనుబంధంగానే కొనసాగుతున్నారు. అప్పటి నుండి అమెరికా నుండి తీసుకొచ్చి ఖర్చు పెట్టించిన యార్లగడ్డను వైసీపీ పక్కన పెట్టేసింది. ఆది నుంచి ఇక్కడ వైసీపీని డెవలప్ చేసిన యార్లగడ్డను కాదని.. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున వంశీ ఇక్కడ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది.
దీంతో కొంతకాలంగా వంశీపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్న యార్లగడ్డ.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఇప్పుడు వైసీపీని వీడి పసుపు సైన్యంలో చేరనున్నారు. దీంతో ఉమ్మడి కృష్ణాలో ముమ్మర చర్చ జరుగుతుంది. యార్లగడ్డ టీడీపీలో చేరితే వల్లభనేని వంశీ ఇక గన్నవరంపై ఆశలు వదులుకోవాల్సిందే అనే ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే ఆర్ధికంగా బలంగా ఉన్న యార్లగడ్డ ఏది ఏమైనా ఈసారి వంశీని ఓడించాలని బలంగా నిర్ణయించుకున్నారు. గత ఎన్నికలలో కూడా వంశీకి గట్టి పోటీ ఇచ్చారు. కానీ కేవలం వెయ్యి ఓట్ల తేడాతో వంశీ గెలిచారు. అయితే, ఈసారి రాజధాని అంశం, ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు యార్లగడ్డపై సానుభూతి కూడా తోడవనుంది. ఈ క్రమంలో వంశీకి ఈసారి గన్నవరంలో ఎదురీత తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదీ గాక గతంలో మొత్తం తెలుగుదేశం గంపగుత్తగా వంశీ వెనుక నిలబడింది. ఇప్పుడు వైసీపీ శ్రేణులు గన్నవరంలో వంశీకి మద్దతు ఇచ్చే పరిస్థితులు అంతంత మాత్రమేనని కూడా అంటున్నారు.