జర్నలిస్టులపై కరోనా పంజా.. ప్రభుత్వాలకు లేదు కరుణ!
posted on Apr 29, 2021 @ 1:33PM
కరోనా మహ్మమారి జర్నిలిస్టులను బలి తీసుకుంటోంది. గత పది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 మంది వరకు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో స్ట్రింగర్లు మాత్రమే కాదు… జిల్లా స్థాయి రిపోర్టర్లు .. సీనియర్ జర్నలిస్టులు.. డెస్క్‌లో పని చేసేవాళ్లు కూడా ఉన్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారిలో సీనియర్ జర్నలిస్టులు అమర్‌నాథ్, శ్రీనాద్ కూడా ఉన్నారు. జర్నలిస్టు ఉద్యమంలో కీలకంగా పని చేసిన అమర్ నాథ్.. కరోనాతో పది రోజుల పాటు పోరాడి నిమ్స్‌లో చనిపోయారు.
మెదక్ జిల్లా ఈనాడు స్టాప్ రిపోర్టర్, శ్రీకాకుళం ఎన్టీవీ రిపోర్టర్ , కడప జిల్లా సాక్షి రిపోర్టర్, కృష్ణా జిల్లాలో ఎన్టీవీ రిపోర్టర్, బతుకమ్మ టీవీ సీఈవో ప్రాణాలు కోల్పోయారు. సాక్షి కడప జిల్లా స్టాఫర్ తో పాటు డెస్క్‌లో పని చేసే రామచంద్రరావు అనే సబ్ ఎడిటర్ కూడా కరోనా కారణంగా చనిపోయారు. మండల రిపోర్టర్లు వైరస్ భారీన పడి ప్రాణాలు వదిలారు. వందలాది మంది జర్నలిస్టులు కరోనా సోకి మృత్యువుతో పోరాడారు. కొందరు ఉన్న ఆస్తులన్ని అమ్మి ప్రాణాలు దక్కించుకున్నారు.ప్రతి జిల్లా, నియోజకవర్గంలోనూ పదుల సంఖ్యలో జర్నలిస్టులు మహ్మమారి భారీన పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు.
జర్నలిస్టుల కోసం సంఘాల్లో అత్యున్నత స్థాయిలో పనిచేసిన అమర్‌నాథ్ చనిపోతేనే.. పెద్దగా ఎవరూ పట్టిచుకోలేదు. ఇతర జర్నలిస్టుల గురించి ఎవరు పట్టించుకుంటారు.ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడం మానేశాయి. బతికి ఉండి.. పత్రిక కోసం పని చేస్తున్నప్పుడు మాత్రమే వారి అవసరం నేతలకు ఉంది. చనిపోయిన తర్వాత వారి గురించి పట్టించుకునే తీరిక కూడా నేతలకు లేదు. దీంతో జర్నలిస్టులు.. అంపశయ్యమీద ఉన్నట్లు అయింది.
ఏపీలో జర్నలిస్టుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏపీలో జర్నలిస్ట్ లకు అక్రిడేషన్స్ లేవు.. హెల్త్ కార్డ్స్ లేవు.. ఆరోగ్య భీమా.. ప్రమాద బీమా లేవు.. గత రెండేళ్లుగా కనీసం గుర్తింపు కూడా లేదు. దీంతో ఆరోగ్య సమస్యలు వస్తే వారికి చికిత్స అందడం లేదు. అక్రిడేషన్లు లేకపోవడంతో కనీసం బస్ పాస్ కూడా ఏపీ జర్నలిస్టులకు లేకుండా పోయింది. అయినా వృత్తి పట్ల ఉన్న మక్కువ తో జర్నలిస్ట్ లు గానే బతుకు బండి సాగిస్తున్నారు. ఎలాగోలా బతుకు బండిని లాగుతున్న జర్నలిస్ట్ ల పాలిట కరోనా శాపంగా మారింది. మంత్రులు.. ముఖ్య మంత్రులు..అధికారులు.. ప్రోగ్రామ్స్ ను వారికంటే ముందుగా వెళ్లి గంటల తరబడి వేచి వుండి కవరేజ్ ఇచ్చే జర్నలిస్టులకు బతుకు కవరేజ్ కి గ్యారంటీ లేకుండా పోయింది.
ప్రాణాలు తెగించి పని చేస్తున్నా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కూడా జర్నలిస్ట్ లను గుర్తించడం లేదు. పారిశుధ్య కార్మికులకు ఇచ్చే భరోసా కూడా జర్నలిస్ట్ లకు లేదు. కనీసం కోవిడ్ వ్యాక్సిన్ ను అందించే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదంటే జర్నలిస్ట్ అంటే ఏ పాటి గౌరవం ఉందొ అర్ధం చేసుకోండి. పరుగులు పెట్టి.. పోటీ పడి న్యూస్ కవర్ చేసి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్న జర్నలిస్టులు కరోనా కాటుకు బలి అవుతున్న కనీసం స్పందన లేదు. జర్నలిస్ట్ ల కుటుంబాలకు రక్షణ.. ఆదరణ అసలే లేదు.. పాలకులారా.. మావైపు చూడండి.. ఏళ్ళ తరబడి మీకు సేవలు అందించిన జర్నలిస్ట్ లను కాపాడుకోండి అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిని విన్నవించుకుంటున్నాయి ఏపీ జర్నలిస్ట్ సంఘాలు.
తెలంగాణలోనూ అదే పరిస్థితి. హెల్త్ కార్డులు ఇచ్చినా అవి పని చేయడం లేదు. పెండింగ్ బిల్లులను సర్కార్ క్లియర్ చేయకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్లు జర్నిలిస్టు హెల్త్ కార్డులను తీసుకోవడం లేదు. కరోనా సమయంలో అసలు వాటిని చూడటం కూడా లేదు. దీంతో కరోనా సోకిన జర్నలిస్టులు చికిత్సకు డబ్బులు లేక ప్రాణాలు వదులుతున్నారు. అంతంత జీతాలతో కాలం వెళ్లదీసే జర్నలిస్టులు లక్షలాది రూపాయలతో చికిత్స ఎలా తీసుకుంటారు. కరోనాతో జర్నలిస్టులు చనిపోతున్నా.. ప్రభుత్వాలు కాని, మీడియా యాజమాన్యాలు కాని పట్టించుకోవడం లేదు. విధులకు మాత్రం పంపిస్తున్నారు. ఇంతటి పరిస్థితుల్లోనూ జర్నలిస్టులు కోవిడ్ హాస్పిటల్స్, టెస్టింగ్ సెంటర్ల దగ్గర రిపోర్టింగ్ చేస్తూ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, మీడియా యాజమాన్యాలు స్పందించి జర్నలిస్టుల బతుకులకు భరోసా కల్పించాలని సంఘాలు కోరుతున్నాయి.