చార్‌ధామ్ యాత్ర రద్దు.. కుంభమేళా ఎఫెక్ట్..
posted on Apr 29, 2021 @ 1:47PM
పవిత్ర చార్‌ధామ్ యాత్ర రద్దు అయింది. ఉత్తరాఖండ్‌లో ఏటా జరిగే చార్‌ధామ్ యాత్రను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రద్దు చేసింది. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ ప్రకటించారు. నాలుగు ఆలయాల్లోకి భక్తులెవరినీ అనుమతించేది లేదని, కేవలం అర్చకులే పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు.
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్,యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్‌ధామ్‌లుగా పిలుస్తారు. ఈ ఆలయాలు సంవత్సరంలో ఆరు నెలలు మంచుతో మూసుకుపోయి ఉంటాయి. వేసవి నుంచి ఆరు నెలలు మాత్రమే భక్తులు సందర్శించుకునేందుకు వీలుంటుంది. ఈ ఏడాది మే 14 నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా దృష్ట్యా ఈ సారి యాత్రను ప్రభుత్వం రద్దు చేసింది. ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 6వేలకు పైగా కేసులు బయటపడగా.. 108 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.
ఇటీవల జరిగిన కుంభమేళాపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. కుంభమేళా కారణంగా వేలాది మంది సాధువులు, భక్తులు కరోనా బారిన పడ్డారు. కొవిడ్ సంక్షోభం సమయంలో కుంభమేళా నిర్వహించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో.. మళ్లీ ఈ సమయంలో చార్‌ధామ్ యాత్రకు అనుమతిస్తే కరోనా కేసులతో పాటు విమర్శలూ మరింత పెరుగుతాయని భావించింది ప్రభుత్వం. ఈ ఏడాదికి చార్‌ధామ్ యాత్రను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.