జైల్లో పెట్టినా.. చంపినా.. ప్రశ్నిస్తూనే ఉంటా..
posted on Apr 29, 2021 @ 1:21PM
‘‘22 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నామీద తప్పుడు కేసులు పెట్టి.. నా గొంతు నొక్కలేరు. నన్ను రాజమండ్రి జైలులో పెట్టినా.. చంపినా.. ప్రశ్నిస్తూనే ఉంటాను. పోరాడుతూనే ఉంటాను’’ అంటూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మండిపడ్డారు.
సీఎం జగన్ మాటల మార్ఫింగ్ వీడియో కేసులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీఐడీ విచారణకు హాజరయ్యారు. తనపై తప్పుడు కేసులు బనాయించారని దేవినేని అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అక్రమ కేసులపై కోర్టుల్లో పోరాడతానని చెప్పారు.హైకోర్టు ఆదేశాల్ని గౌరవిస్తూ విచారణకు హాజరయ్యానని ఉమా అన్నారు.
‘‘ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడ, గుంటూరు ప్రభుత్వ హాస్పిటళ్లను సందర్శించాలన్నారు ఉమా. ప్రభుత్వానికి మానవత్వం లేదు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే.. జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు, సినిమాలు చూస్తున్నాడు. వ్యాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉంది. వ్యాక్సిన్ వేయించలేని పరిస్థితి ఉంది. కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోని సీఎం.. పాలనను గాలికొదిలేశారంటూ దుయ్యబట్టారు దేవినేని ఉమా.
ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటి? అమూల్ కోసం సంగం డెయిరీ ఆస్తులను తాకట్టు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ మెప్పు కోసం కొందరు అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు’’ అని దేవినేని మండిపడ్డారు.