డీజీపీ మహేందర్ రెడ్డికి కరోనా
posted on Aug 16, 2022 @ 10:16AM
కరోనా మహమ్మారి పీడ ఇంకా పూర్తిగా వదల లేదు. కరోనా పెండమిక్ నుంచి ఎండమిక్ స్టేజ్ కు చేరుకుందని ప్రభుత్వం ప్రకటించినా తెలంగాణలో ఇంకా కోవిడ్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ప్రతి రోజూ కరోనా పాజిటివ్ కేసులు నమోదౌతూనే ఉన్నాయి.
తాజాగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. స్వాతంత్ర్య వజ్రోత్సవ కార్యక్రమాలలో పాలుపంచుకున్న ఆయన ఆదివారం అర్థరాత్రి వరకూ కార్యక్రమాలను పర్యవేక్షస్తూనే గడిపారు.
అయితే సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అనుమానంతో ఆయన కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. దానిలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోంఐసోలేషన్ లోకి వెళ్లారు.
సోమవారం ఉదయం గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకలకు ఆయన దూరంగా ఉన్నారు. ఆయన తరఫున అదనపు డీజీ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు.