కూల్‌డ్రింక్స్‌తో మెదడు దెబ్బతింటుందా?
posted on Mar 30, 2019 @ 10:52AM
ఎండాకాలం వచ్చిందంటే చాలు... దాహంతో నాలుక పిడచకట్టుకుపోతుంది. ఆ దాహాన్ని కూల్‌డ్రింక్స్‌తో తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటాం. స్వచ్ఛమైన నీటిని వదిలేసి ఇలా చల్లటి కూల్‌డ్రింక్స్‌తో దాహం తీర్చుకోవడం ఏమంత మంచి పని కాదని నిపుణులు వాదిస్తూనే ఉంటారు. వాటివల్ల దాహం తీరకపోగా డయాబెటిస్, ఊబకాయం, కిడ్నీరాళ్లు వంటి సమస్యలు ఏర్పడతాయని హెచ్చరిస్తుంటారు. తాజాగా జరిగిన ఓ పరిశోధన మరో అడుగు ముందుకు వేసి... కూల్‌డ్రింక్స్‌తో అసలు మెదడే పాడైపోతుందని హెచ్చరిస్తోంది.
మెదడు మీద శీతలపానీయాల ప్రభావాన్ని గమనించేందుకు అమెరికాలోని శాస్త్రవేత్తలు సంకల్పించారు. ఇందుకోసం వారు ఓ నాలుగువేల మంది ఆహారపు అలవాట్లను గమనించారు. వారానికి కనీసం మూడుసార్లన్నా శీతలపానీయాలను తీసుకునేవారిని మరికాస్త శ్రద్ధగా గమనించారు. MRI వంటి ఆధునిక పరీక్షల ద్వారా వీరి మెదడులో వస్తున్న మార్పులను పసిగట్టే ప్రయత్నం చేశారు.
కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నవారి మెదడులోని కణాలు త్వరగా నిర్వీర్యం అయిపోవడాన్ని పరిశోధకులు గమనించారు. జ్ఞాపకశక్తి క్షీణించడం, గతం మర్చిపోవడం, మెదడు కుంచించుకుపోవడం, ఏకాగ్రత నిలపలేకపోవడం... లాంటి సవాలక్ష సమస్యలు తలెత్తుతున్నాయని తేలింది. ఈ లక్షణాలన్నీ అల్జీమర్స్ వంటి వ్యాధులకు దారితీసే అవకాశం కూడా లేకపోలేదు.
డైట్ కూల్‌డ్రింక్స్ మరింత ప్రమాదం!
మామూలు శీతలపానీయాలకంటే డైట్స్ కూల్‌డ్రింక్స్ సురక్షితం అన్నది ప్రజల భావన. కానీ రోజుకి ఒక డైట్ కూల్‌డ్రింక్ చప్పున తాగేవారు పక్షవాతం లేదా మతిమరపు బారిన పడే ప్రమాదం మూడురెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. డైట్ కూల్‌డ్రింక్స్‌లో ఉండే కృత్రిమ తీపిపదార్థాలే ఇందుకు కారణం అని భావిస్తున్నారు. కృత్రిమమైన తీపి పదార్థాల వల్ల తక్కువ కెలోరీలు లభించవచ్చుగాక. కానీ దీర్ఘకాలికంగా ఇవి వినాశనానికే దారితీస్తాయన్నది ఎప్పటినుంచో వినిపిస్తున్న వాదనే!
ఏతావాతా మన జీవితంలో ఉప్పుతో పాటుగా, చక్కెర పదార్థాలని కూడా తక్కువగా తినాలని తాజా పరిశోధన సూచిస్తోంది. అందులోనూ ‘ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్’ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. అందుచేతా... ఎండాకాలం మాంచి దాహం వేస్తే కూల్‌డ్రింక్స్ ద్యాసని వదిలిపెట్టి చెంబుడు మంచినీటిని గొంతులో పోసుకుంటే సరి!
- నిర్జర.