వేసవి వేడిని తట్టుకొనేందుకు 7 చిట్కాలు

 

ఇదేమన్నా బ్రహ్మ విద్యా! ఇంటిపట్టున కూర్చోవడం, తరచూ మంచినీళ్లు తాగడం... లాంటి చిట్కాలతో వేసవి వేడిని ఎదుర్కొంటాం కదా! అంటారా. నిజమే. కానీ మనం ఎప్పుడూ పట్టించుకోని మరికొన్ని ఉపాయాలు కూడా ఆచరించి చూడమని సూచిస్తున్నారు నిపుణులు. అవేమిటంటే...

మణికట్టు చల్లగా -

 

 

మణికట్టు, మెడ భాగాలలోని రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉంటాయి. ఈ ప్రదేశాల మీద ధారాళంగా నీరు పోయడం, తడి బట్ట కట్టడం వల్ల... రక్తంలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీరం త్వరగా చల్లబడిపోతుంది. అయితే ఎండతో తిరిగి తిరిగి వచ్చిన వెంటనే ఈ పని చేయడం అంత సురక్షితం కాకపోవచ్చు.

 

కాఫీ, టీలకు దూరం -

 

 

వేసవిలో గొంతు ఎండిపోతోంది కదా అని రోడ్డు పక్కన ఆగి వేడివేడి టీలు చప్పరిస్తుంటారు. వేడి నీరు ఒంట్లోకి దిగగానే, వాటిని సాధారణ ఉష్ణోగ్రతలోకి మార్చుకునేందుకు శరీరం కష్టపడుతుంది. పైగా కాఫీ, టీలలో ఉండే కెఫిన్‌తో డీహైడ్రేషన్ మరింత ఎక్కువవుతుందన్న వాదనలూ ఉన్నాయి. అందుకని దాహం వేసినప్పుడు కొబ్బరినీరు, నీరు, గ్లూకోజ్‌ వంటి పానీయాలకే ప్రాధాన్యత ఇవ్వాలి.

 

జుత్తుని కాస్త తడుపుకుంటే -

 

 

వేసవిలో మాడు కూడా వేడిగా అనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ కొబ్బరి నూనె పెట్టుకోమని తిడుతుంటారు పెద్దలు. మనం ఎలాగూ ఆ మాట వినం కదా! అందుకే ఇంటిపట్టున ఉన్నప్పుడు తడి చేతులని కాస్త జుత్తులోకి పోనిచ్చి చూడండి. అలా జుత్తుని కాస్త తడిగా ఉంచడం వల్ల మాడుని కాసేపటవరకూ చల్లగా ఉంచగలుగుతాము.

 

అలోవెరా -

 

 

ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ చవకగా అలోవెరా గుజ్జు దొరుకుతోంది. చర్మాన్ని చల్లబరిచే గుణం అలోవెరాలో పుష్కలంగా ఉంది. పైగా వేసవిలో వచ్చే చర్మ సమస్యలకు కూడా ఇది ఔషధంగా పనిచేస్తుంది.

 

వ్యాయామం మానొద్దు –

 

 

వ్యాయామం వల్ల స్వేదరంధ్రాలు శుభ్రపడి చెమటపొక్కుల వంటి సమస్యలు దరిచేరవు. శరీరానికి కావల్సినంత దాహం కలుగుతుంది. ఒంట్లోని ప్రతి అవయవమూ శుభ్రపడుతుంది. కాకపోతే వేసవిలో వ్యాయామం చేసటప్పడు అదనపు జాగ్రత్తలు అవసరం. నీడపట్టున వ్యాయామం చేయాలి, తగినంత విశ్రాంతి తీసుకుంటూ తక్కువసేపు వ్యాయామం చేయాలి. శరీరానికి తగినంత నీరు, ఉప్పు లభించేలా జాగ్రత్తపడాలి.

 

అత్యవసరం అయితేనే షూస్ –

 

 

మన ఒంట్లోని వేడిలో కొంత భాగం పాదాల ద్వారా కూడా బయటకు వెళ్తుంది. మరి ఆ పాదాలనే పూర్తిగా మూసివేస్తే.... ఒంటికి ఉక్కపోత తప్పదు. అందుకనే వేసవిలో అత్యవసరం అయితే తప్ప షూస్ ధరించకూడదు. ఒకవేళ ఆఫీసుకి షూస్‌ వేసుకుని వెళ్లాల్సి వచ్చినా... సీట్లోకి చేరగానే వాడిని విడిస్తే మేలు.

 

కళ్ల మీద కీరా

 

 

వేసవిలో కీరదోసని తినడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది. ఓ రెండు కీర ముక్కల్ని గుండ్రంగా కోసుకుని కళ్ల మీద పెట్టుకోవడం వల్ల కూడా ఒంట్లోని నిస్సత్తువ తీరిపోయిన అనుభూతి కలుగుతుంది. కీరని కళ్ల మీద పెట్టుకుంటే ఒంట్లోని ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నది నిపుణుల మాట!

- నిర్జర.