వయసుని మోసం చేయవచ్చు...!
posted on Apr 22, 2017 @ 1:04PM
ప్రతి జీవికి ప్రకృతి ‘ఇంత వయసు వరకూ బతకవచ్చంటూ’ హామీ ఇస్తుంది. అలాగే మనిషికి కూడా నిండు నూరేళ్లు బతకమని దీవించింది. కానీ మనిషి మాత్రం అస్తవ్యస్తమైన జీవనశైలితో తన ఆయుష్షుని తుంచేసుకుంటున్నాడు. కాస్త జాగ్రత్త పడితే ఆ తప్పుని సరిదిద్దుకోవచ్చుననీ సూచిస్తున్నారు పరిశోధకులు.
బ్రిటన్లోని Babraham Instituteకి చెందిన పరిశోధనకులు వయసుని నియంత్రించే ఓ వ్యవస్థను కనుగొన్నారు. DNA methylation అని పేర్కొనే ఈ వ్యవస్థ, జన్యువుల పనితీరుని ప్రభావితం చేస్తుందని తేలింది. ఈ వ్యవస్థ మరీ వేగంగా పనిచేస్తుంటే వృద్ధాప్యం త్వరగా కమ్మేస్తోందని గమనించారు. ఉదాహరణకు- ఫ్యాటీలివర్ వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ గడియారం త్వరత్వరగా పరిగెడుతోందట. మరోవైపు, సుదీర్ఘమైన ఆయుష్షు కలిగినవారిలో ఇది నిదానంగా పనిచేస్తోందట!
వృద్ధాప్యాన్ని నియంత్రించే గడియారాన్ని కనుగొన్నారు సరే! మరి మన ఆహారపు అలవాట్లు సదరు గడియారం మీద ప్రభావం చూపుతాయా అన్న అనుమానం కలిగింది పరిశోధకులుకి. అనుమానం వచ్చిందే తడవుగా కొన్ని ఎలుకల మీద తమ ప్రయోగాన్ని సాగించారు. సదరు ఎలుకలకి కొవ్వు పదార్థాలని అధికంగా అందించినప్పుడు, ఈ గడియారం వేగం పుంజుకుంటున్నట్లు తేలింది.
ఈ ఆవిష్కరణ తరువాత మనిషి జీవితాన్నీ, ఆయుష్షునీ ప్రభావితం చేసే మరిన్ని పరిశోధనలు జరగనున్నాయి. మనిషిలోని ఈ గడియారం తీరుని గమనించడం ద్వారా రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టవచ్చు. ఈ గడియారాన్ని ప్రభావితం చేస్తున్న రసాయనాలను కనుక ఛేదించగలిగితే, వృద్ధాప్యాన్నే నిలువరించవచ్చు. ఇంకా మాట్లాడితే వృద్ధాప్యాన్ని సైతం వెనక్కి మళ్లించి తిరిగి యవ్వనాన్ని కూడా సాధించవచ్చు. ఆయుష్షునీ పెంచవచ్చు. ఇవన్నీ వినడానికి ఇప్పుడు అతిశయోక్తులుగా తోస్తాయి కానీ, భవిష్యత్తులో తప్పకుండా సాకారం అవుతాయని ఆశిస్తున్నారు శాస్త్రవేత్తలు.
- నిర్జర.