నా హత్యకు కుట్ర..ఈటల ఆరోపణ
posted on Nov 3, 2022 7:02AM
ఈటల రాజేందర్ పై హత్యాయత్నం జరిగిందా.. మునుగోడులో ఈటల కాన్వాయ్ పై దాడి అదేనా? అంటు బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఔననే అంటున్నారు. తనపై హత్యకు కుట్ర జరిగిందనీ, మునుగోడులో తనపై పక్కా ప్రణాళిక మేరకే దాడి జరిగిందనీ ఆయన ఆరోపించారు. తనకు ఏం జరిగినా సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో బీజేపీ నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు.
తనను హత్య చేయాలని కుట్ర జరుగుతోందనీ, అందుకే హుజురాబాద్ లో అవసరం లేకున్నా పెద్ద సంఖ్యలో గన్ లైసెన్సులు ఇచ్చారని ఈటల ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తాను గెలిచినప్పటి నుంచీ కేసీఆర్ తనపై పగబట్టారని ఈటల అన్నారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో మరోసారి టీఆర్ఎస్ ఘోరంగా పరాజయం పాలు కాబోతున్నదని ఈటల అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అర్దరాత్రుళ్లు కూడా నిర్భయంగా బయట తిరిగే వాళ్లమనీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పట్టపగలు బయటకు వెళ్లి తిరిగి వస్తామన్న నమ్మకం లేకుండా పోయిందనీ ఈటల అన్నారు.
పథకం ప్రకారం తన కాన్వాయ్ పై దాడి చేశారనీ, పలివేల గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్నారనీ ఈటల పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకుంటుంటే పోలీసు వ్యవస్థ ఏమి చేస్తోందని నిలదీశారు.