తండ్రి బ్రాండ్ కొడుకుదా.. కూతురిదా?
posted on Jun 21, 2023 6:14AM
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు కాంగ్రెస్ రాజకీయాలు జగన్ పరువు తీస్తున్నాయి. ఇప్పటికే రెండుగా చీలిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం తాజా పరిణామాలతో మరింత ఇరకాటంలో పడింది. తెలంగాణలో వైఎస్ఆర్ పేరుతో వేరు కుంపటి పెట్టుకున్న షర్మిల ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తుండటంతో జగన్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తల్లి, చెల్లెళ్లను విజయవంతంగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ రాజకీయాల వైపు నెట్టేసి , తనకు తిరుగులేదని ఊపిరి పీల్చుకుంటున్న జగన్ తాజా పరిణామాలతో అవాక్కయ్యారు.
కాంగ్రెస్ మూలాల నుండి వచ్చిన రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని తిరిగి కాంగ్రెస్ నీడన చేర్చేందుకు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు. జులై 8న వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇడుపుల పాయలోని ఆయన సమాధిని సందర్శించాలని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు నిర్ణయించుకున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రారంభించిన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందన్న ఊహాగానాలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న నేపథ్యంలో జులై 8న ఇడుపుల పాయ కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేలా అంగీకరింపచేయడంలో వెనుక ఉండి కథ నడిపింది.. వైఎస్సార్ ఆత్మ అని చెప్పుకునే కేవీపీ రామచంద్రారెడ్డి తన వంతు ప్రయత్నం చేశారు. ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతల వద్ద తన పలుకుబడిని ఉపయోంగించి వారి నుంచి అభ్యంతరాలు రాకుండా మంతనాలు, మంత్రాంగం నెరిపారు.
ఆ తరువాత కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా షర్మిలకు కాంగ్రెస్ ద్వారాలు తెరిచేలా చేశారు. అన్నిటికీ మించి తాను టీపీసీసీ చీఫ్ గా ఉన్నంత కాలం తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల రాజకీయాలు చేయలేరని ప్రకటించిన రేవంత్ రెడ్డిని కూడా ఒప్పించారు. తద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి తమ బ్రాండ్ అని నమ్ముతున్న కాంగ్రెస్ ఈ అంశాన్ని రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సమర్ధవంతంగా ప్రచారంలో పెట్టాలని భావిస్తోంది. వైఎస్ఆర్ బ్రాండ్ తనదే అంటూ ప్రతీ పథకానికి ఆయన పేరు తగిలించి ప్రచారం చేసుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇది ఎంతమాత్రం మింగుడు పడని విషయం. కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మంచి జోష్ లో ఉండడం, కర్నాటక మోడల్ ను తెలంగాణలో అనుసరించేందుకు వ్యూహాలు రచించడం ఒక ఎత్తు అయితే పదేళ్ల కెసీఆర్ పాలనపై నాయకులలో ప్రజల్లో ఉన్న అసహనాన్నిఓట్లుగా మార్చుకునేందుకు కాంగ్రెస్ సిద్దమవుతోంది.
వైఎస్ షర్మిల వంటి నాయకురాలిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని ఒక్క తాటిపై తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న విలీన ప్రయత్నం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాల్సిందే. మరో వైపు నాయకులు ఎక్కువగా ఉండే కాంగ్రెస్ లో పదవుల పంపకం రేపు పెద్ద సమస్య కాక మానదు. షర్మిల పార్టీని విలీనం చేసుకుని బిఆర్ఎస్ కు బిజెపికి గట్టి సవాల్ విసిరాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో పాటు మరిన్ని పార్టీలు తమ మద్దతును కాంగ్రెస్ కు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టిపి విలీనం ఇటు తెలంగాణ రాజకీయాలనే కాక ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.