ఆదిపురుష్ ని పూర్తిగా బ్యాన్ చేయండి.. ప్రధానికి లేఖ!
posted on Jun 20, 2023 @ 5:26PM
ఆదిపురుష్ ని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. సినిమా విడుదలకు ముందే పలు పాత్రల వేషధారణపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఇంక సినిమా విడుదల తర్వాత దర్శక నిర్మాతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రావణుడి పాత్రని చూపించిన తీరు, హనుమంతుడి డైలాగ్ లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. శ్రీరాముడిని అడ్డుపెట్టుకొని ఇలాంటి సినిమా తీస్తారా? ఈ తరం పిల్లలు ఇదే నిజమైన రామాయణం అనుకుంటే ఎలా? అంటూ పలువురు మండిపడ్డారు.
ఈ విమర్శల దెబ్బకి ఆదిపురుష్ టీమ్ మాట మార్చింది. విడుదలకు ముందు రామాయణం, జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ ప్రచారం చేసుకొని.. విడుదల తర్వాత మాత్రం ఆ చిత్ర రచయిత మనోజ్ మాట మార్చి ఇది రామాయణం కాదు, దాని స్ఫూర్తితో చేసిన సినిమా మాత్రమే అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దాంతో ఆదిపురుష్ విమర్శలు మరింత పెరిగాయి. ఇక తాజాగా ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ అయితే ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ ఏకంగా ప్రధాని మోడీకి లేఖ రాసింది.
ఆదిపురుష్ సినిమా స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు శ్రీరాముడిని, హనుమంతుడిని కించపరిచేలా ఉన్నాయి. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. మతాలతో సంబంధం లేకుండా భారతీయులందరికీ శ్రీరాముడు దేవుడు. రాముడు, రావణుడి పాత్రలు వీడియో గేమ్ ని తలపిస్తున్నాయి. సంభాషణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరినీ బాధపెట్టేలా ఉన్నాయి. ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయవలసిందిగా మేము గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అభ్యర్థిస్తున్నాము.
వెంటనే థియేటర్ల నుంచి తొలగించడమే కాకుండా, భవిష్యత్తులో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా స్క్రీనింగ్ జరగకుండా నిషేధించాలని కోరుతున్నాము. అలాగే ఈ చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాతలపై కేసు నమోదు చేయాలి" అని కోరుతూ ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. మరి ఈ లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.