టీకాంగ్రెస్ పొలంలో మొలకలొస్తున్నాయ్!
posted on Jun 21, 2023 6:21AM
ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇకపై మరోలెక్క. ఇన్నాళ్లూ కునారిల్లుతున్న పార్టీకి టైం వచ్చేస్తుంది. చాలా కాలంగా డీలా పడిపోయిన పార్టీకి ఇప్పుడు జవసత్వాలొస్తున్నాయి. ఇన్నాళ్లూ వెళ్ళేవాళ్ళే కానీ వచ్చేవాళ్లెవరంటూ ఎదురు చూసి చూసి కళ్లు కాయలు కాసిన కాంగ్రెస్ కు ఇప్పుడా ఎదురు చూపులు ఫలితాలను ఇస్తున్నాయి. మేమొస్తున్నామంటూ పలు పార్టీల నేతల నుంచి సంకేతాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా దేని గురించి చెప్తున్నామో అర్ధమయ్యే ఉంటుంది. ఔను.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించే ఇదంతా. ఇప్పుడిప్పుడే మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ పొలంలో మొలకలొస్తున్నాయి. ఇన్నాళ్లూ రండి బాబూ రండి మా పార్టీలో చేరండని అడిగినా పట్టించుకోని నేతలు ఇప్పుడు మేము వస్తే టికెట్ ఇస్తారా అంటూ రాయబారాలు పంపిస్తున్నారు. దీంతో ఈసారి ఎన్నికలలో మూడు ముక్కలాట తప్పదా అనే చర్చలు జరిగిపోతున్నాయి.
రాజకీయ పార్టీలకు స్వతహాగా ఒకలక్షణం ఉంటుంది. సమర్థులైన నేతలు అనునిత్యం పోరాటం చేస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ, ఎప్పటికప్పుడు అధికార పార్టీని ఇరకాటంలో పెట్టి ప్రజల ముందు దోషిగా నిలబెడితే, తనంతట తానుగా పోరాడిన పార్టీ వృద్ధిలోకి వస్తుంది. కానీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సమర్థులైన నేతలు ఉన్నా.. నిత్యం అంతర్గత కుమ్ములాటలతో ప్రజలలో పలచబడుతూ వచ్చారు. దీంతో ఇన్నాళ్లు ఆ పార్టీకి కొత్త వారు రావడమంటే సాహసంగా భావిస్తే.. ఉన్నవాళ్ళేమో ఉన్న దానిలో పదవుల పంపకం కోసం వైరాలు పెంచుకుంటూ వచ్చారు. అయినా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు మొదలయ్యాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంతో పాటు.. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ లో నేతల ఓవర్ లోడింగ్ ఇప్పుడు ఆ పార్టీకి కలిసి వచ్చిన అవకాశంగా మారింది.
ఎన్ని పోరాటాలు చేసినా.. ఎన్ని ఉద్యమాలు చేసినా కలిసిరాని కాలం.. ఒక టైం వచ్చి రాజకీయ అవసరం ఏర్పడితే ఊహించనివిధంగా కలిసి వస్తుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో అదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో రెండో ప్రత్యామ్నాయంగా బీజేపీ, కాంగ్రెస్ కి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, కర్ణాటకలో బీజేపీ ఓటమి ప్రభావం ఎంతో కొంత తెలంగాణలో కూడా కనిపిస్తుంది. దీంతో కొత్తగా పార్టీ మారేవారికి కాంగ్రెస్ ఒక అప్షన్ గా కనిపిస్తోంది. పైగా తెలంగాణ ప్రసాదించిన పార్టీగా గోల్ చేసుకొనేందుకు అవకాశం కాంగ్రెస్ కు మిగిలి ఉంది. అంటే ఒక విధంగా బీఆర్ఎస్ పై ఫెనాల్టీ కార్నర్ చాన్స్ అన్న మాట. దీంతో బీఆర్ఎస్ అసమ్మతి నేతలు, ఈసారి టికెట్ దక్కదేమో అని సందేహపడుతున్న నేతలు, గులాబీ పార్టీ అధిష్టానంతో విభేధించే వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తమ డెస్టినేషన్ గా ఎంచుకుంటున్నారు.
తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు గత రెండు రోజులుగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఈ ఇద్దరూ ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా అధికార బీఆర్ఎస్ నుండి ఎలాగూ టికెట్ దక్కదనే ఆలోచనతో కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరితో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టున్న పట్నం మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నాని గట్టిగా వినిపిస్తోంది. పట్నం మహేందర్ తాండూరు నుండి పోటీచేసి పైలట్ రోహిత్ రెడ్డిపై ఓడిపోయారు. ఆ ఎన్నికలలో కొడంగల్ నుండి రేవంత్ రెడ్డిపై పోటీచేసిన పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడిని గెలిపించుకునే క్రమంలో తాను పోటీ చేస్తున్న తాండూరుపై కాన్సన్ ట్రేట్ చేయకపోవడంతో అప్పుడు పరాజయం పాలయ్యారు. అయితే అక్కడ్నుంచి గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకున్న కేసీఆర్ ఈసారి కూడా ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ధృవీకరించేశారు. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కి రావాల్సిన అవసరం వచ్చింది. అయితే అప్పుడు పనిగట్టుకొని ఓడించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షడు, దీంతో ఇప్పుడు పట్నం పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
వచ్చే నెలలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. కర్ణాటక ఫలితాలే ఇప్పుడు పార్టీలో జోష్ పెంచితే.. ఇక రాహుల్ రాకతో అంతకి మించి అనేలా జోష్ పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈలోగానే రాహుల్ సమక్షంలో భారీగా చేరికలకు ఇక్కడి నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చేరికల కోసం పీసీసీ అధ్యక్షుడు ఒక కమిటీని నియమించగా.. ఈ కమిటీ అసంతృప్తి నేతలకు గాలమేసే పనిలో ఉంది. పార్టీలో చేరే వారి జాబితాను ఇప్పటికే సిద్ధం చేసేసింది. అలా వచ్చి చేరేవారిలో కొందరు టికెట్ హామీతో కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతుంటే.. మరికొందరు సర్ధుకుపోవడానికి కూడా సై అంటుండటం విశేషం. మరి కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.