డిల్లీకి చేరుకొన్న ఛోటా రాజన్
posted on Nov 6, 2015 9:09AM
సిబీఐ మరియు ఉన్నతాధికారులు మాఫియా గ్యాంగ్ లీడర్ ఛోటా రాజన్ని ఇండోనేషియా నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు డిల్లీకి తీసుకువచ్చేరు. ఈరోజు తెల్లవారుజామున 5.30-6.00 గంటల మధ్య వారి ప్రత్యేక విమానం డిల్లీలో ల్యాండ్ అవగానే స్పెషల్ కమెండోల సహాయంతో కట్టుదిట్టమయిన భద్రత నడుమ అతనిని డిల్లీలో సిబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో సిబీఐ ప్రధాన కార్యాలయం వైపు ఉన్న అన్ని మార్గాలను మూసి వేసేసారు. సిబీఐ భవనం చుట్టూ ఆ సంస్థ రక్షణ సిబ్బంది కాకుండా అధనంగా కేంద్ర పారిశ్రామిక రక్షణ సిబ్బందిని కూడా మొహరించారు.
మరికొద్ది సేపటిలో సిబీఐ అధికారులు ఛోటా రాజన్ కి వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తారు. అతనిని ప్రశ్నించడానికి జ్యూడిషియల్ కస్టడీ కోసం కోర్టు అనుమతి పొందిన తరువాత మళ్ళీ సిబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించి ప్రశ్నించడం మొదలుపెడతారు. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అతనిపై సుమారు 70పైకి పైగా కేసులు నమోదు చేసారు. అవి కాక డిల్లీ పోలీసులు మరో పది కేసులు నమోదు చేసారు. వాటన్నిటినీ సిబీఐకి బదిలీ చేసారు. కనుక సిబీఐ అధికారులే ఛోటా రాజన్ని అన్ని కేసులలో ప్రశ్నించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు. ముంబై పోలీసుల నుండి తనకు ప్రాణ హాని ఉందని ఛోటా రాజన్ చెప్పడం వలననే బహుశః అన్ని కేసులను సిబీఐకి బదిలీ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సుమారు రెండున్నర దశాబ్దాలుగా పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఛోటా రాజన్ గత నెల 26వ తేదీన ఆస్ట్రేలియా నుంచి ఇండోనేషియాలో బాలి వస్తుండగా ఇండోనేషియా పోలీసులు అతనిని విమానశ్రయంలో అరెస్ట్ చేసారు. అనేక హత్యలు, అక్రమ ఆయుధాల సరఫరా, ముంబై లోకల్ రైళ్ళలో వరుస బాంబు ప్రేలుళ్ళు వంటి అనేక తీవ్రమయిన నేరాలలో అతని ప్రమేయం ఉంది.