కాంగ్రెస్ పార్టీ అల్ప సంతోషం!
posted on Dec 31, 2015 @ 11:13AM
కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రాలో తన పార్టీని పణంగా పెట్టి మరీ రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఎందుకు ఏర్పాటు చేసిందో అందరికీ తెలుసు. అయినా కూడా తెలంగాణాలో అధికారంలోకి రాలేకపోయింది. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, ఆ తరువాత క్రమంగా కనుమరుగవుతుండటం అందరూ ఊహించిందే. కానీ తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ కూడా ఆ పార్టీ పరిస్థితి అలాగే ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ పట్టించుకోకపోవడం వలన కనుమరుగవుతుంటే, తెలంగాణాలో అధికార తెరాస చేపట్టిన ‘ఆకర్ష’ వలన బలహీనపడుతోంది. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ నేతలు కూడా తెరాస ధాటిని తట్టుకోలేక చేతులు ఎత్తేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలను, ప్రజా ప్రతినిధులను, చివరికి ఎన్నికల అభ్యర్ధులను కూడా డబ్బు, పదవులు ఎర వేసి తెరాసలోకి ఆకర్షిస్తూ, రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే లేకుండా చేయాలని తెరాస ప్రయత్నిస్తోందని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. రాజకీయాలలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న జానారెడ్డి వంటి వ్యక్తి తెరాసను ఎదుర్కోలేక నిస్సహాయత వ్యక్తం చేయడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడంతో ఆ పార్టీలో మళ్ళీ కొత్త ఉత్సాహం కనబడుతోంది.
ఇతర పార్టీల అభ్యర్ధులను, మద్దతుదారులను నయాన్నో భయాన్నో లొంగదీసుకొంటున్న తెరాసకు కాంగ్రెస్ సాధించిన ఈ విజయం చెంప దెబ్బ వంటిదని తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. ఇదే ఊపులో జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో కూడా విజయం సాధిస్తామని అన్నారు. డివిజన్లలో పార్టీ కార్యకర్తల అభీష్టం ప్రకారమే సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్దతిలో గ్రేటర్ అభ్యర్థులను ఎంపిక చేస్తామని అన్నారు. అయన మొట్ట మొదటిసారిగా వైకాపాపై కూడా విమర్శలు గుప్పించారు. తెలంగాణాలో ఆ పార్టీ తెరాసకు ఏజెంటుగా వ్యవహరిస్తూ ఎన్నికల సమయంలో పరోక్షంగా సహాయపడుతోందని ఆరోపించారు.
ఒకప్పుడు దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంత చిన్న విజయానికే సంబరపడిపోవడం మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఒకానొకపుడు ఇటువంటి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ లెక్కలోకే తీసుకొనేది కాదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పూర్తయ్యాయో కూడా తెలిసేవి కావు. వాటిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించడం చాలా సర్వసాధారణమయిన విషయంగా అందరూ భావించేవారు. కానీ ఇప్పుడు ఒక ఎంపిటిసి స్థానాన్ని గెలుచుకొన్నా పండుగ చేసుకొంటోంది.
నిజానికి ఈ విజయం కాంగ్రెస్ విజయంగా భావించలేము. పార్టీ అభ్యర్ధులు రాజగోపాల్‌రెడ్డి, దామోదర్ రెడ్డిల స్వంత శక్తి సామర్ద్యాల కారణంగానే అది సాధ్యం అయ్యింది. ప్రస్తుత పరిస్థితులలో ఈ చిన్న విజయం పార్టీకి చాలా గొప్ప ఉత్సాహం కలిగిస్తోంది కనుక దాని నుండి ప్రేరణ పొందే ప్రయత్నం చేయడం తప్పు కాదు. కాంగ్రెస్ పార్టీ సాధించిన ఈ విజయం గురించి గొప్పగా చెప్పుకొంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో తమ పార్టీ బలహీనపడటానికి, తరచూ ఎన్నికలలో పరాజయం పాలవడానికి కారణాలను గ్రహించినట్లే ఉన్నారని ఆయన మాటల ద్వారా అర్ధం అవుతోంది. తమ పార్టీ బలహీనతలను, అధికార పార్టీ బలాన్ని ఆయన గుర్తించారు కనుక అందుకు అనుగుణంగా ఆయన చర్యలు చేప్పట్టినప్పుడే ఫలితాలు ఆశించవచ్చును.
కాంగ్రెస్ పార్టీ తనను తాను ఓడించుకోవడం వలననే ఇతర పార్టీలు నెగ్గుతుంటాయని కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటుంటారు. అది నూటికి నూరు పాళ్ళు నిజం కూడా. కానీ అదే సూత్రం ఇతర పార్టీలకు కూడా వర్తిస్తుంది. అటువంటప్పుడే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంటుంది. కనుక అటువంటి అవకాశం దొరికే వరకు వేచి చూస్తుందా లేక తన బలహీనతలను గుర్తించి వాటిని సరిచేసుకొని విజయం సాధిస్తుందా? అనేది జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తేలిపోతుంది.