ఆంధ్రప్రదేశ్-తెలంగాణా 2015 డైరీ
posted on Dec 30, 2015 @ 12:21PM
రెండు తెలుగు రాష్ట్రాలలో బారీ అంచనాలతో అధికారం చేప్పటిన తెదేపా, తెరాస ప్రభుత్వాలు సుమారు ఒక సంవత్సర కాలం పాటు అంటే ఈ ఏడాది జూన్ నెల వరకు నిత్యం ఏదో ఒక అంశం మీద యుద్ధం చేసుకొంటూ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేశాయని చెప్పక తప్పదు. ఒకానొక సమయంలో రెండు రాష్ట్రాల పోలీసులు కూడా కొట్టుకొనే పరిస్థితి కలిగింది. ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులతో ఇరు ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఆ యుద్ధం తారాస్థాయికి చేరుకొంది. కానీ అంతే వేగంగా అది సమసిపోయింది.
ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సఖ్యత కనిపిస్తోంది. తత్ఫలితంగా ఇరు ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం కూడా బాగా తగ్గిపోయింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించగలుగుతున్నారు. అందుకు ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు.
తెరాస ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ పధకంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులలో పూడికతీత, వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతీ ఇంటికి మంచి నీళ్ళు సరఫరా, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం వంటి వాటి వలన తెరాసకు మంచి పేరు సంపాదించుకొంటోంది. కానీ విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు కారణంగా తీరని అప్రదిష్ట మూటగట్టుకొంది. కేంద్రం సహకారంతో విద్యుత్ సంక్షోభం నుండి గట్టెక్కగలిగింది.
ఈ ఏడాది తెరాసకు చాలా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇంతవరకు జరిగిన ప్రతీ ఎన్నికలలో తెరాస వరుసపెట్టి విజయాలు సాధిస్తోంది. కానీ అందుకు అది అనుకరిస్తున్న పద్దతులను ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్షాలకు చెందిన నేతలను, ప్రజా ప్రతినిధులను తెరాసలోకి ఆకర్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని బ్రష్టు పట్టిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా తెరాస అవేమీ పట్టించుకోకుండా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగిపోతోంది.
రాష్ట్ర విభజన కారణంగా తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హుద్ హూద్ తుఫాను మరింత నష్టం కలిగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మవిశ్వాసం, కృషి పట్టుదల కారణంగా రాష్ట్ర అటువంటి సవాళ్ళను ఎదుర్కొని నిబ్బరంగా ముందుకు సాగుతోంది. ఇటువంటి పరిస్థితులలో రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారం అందించాల్సిన ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా పేరిట రాష్ట్రానికి మరిన్ని అగ్ని పరీక్షలు పెట్టాయి. అయితే వాటి వెనుక ఉద్దేశ్యాలను గ్రహించిన రాష్ట్ర ప్రజలు అవి చేస్తున్న పోరాటాలకు ఆమోదం తెలుపకపోవడంతో వాటిని పక్కనపెట్టక తప్పలేదు.
కేంద్రప్రభుత్వం ఇంతవరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్ వంటి హామీలను అమలుచేయకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశ చెందారు. కానీ ఈ ఒక్క ఏడాదిలోనే కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో ఐ.ఐ.టి., ఐ.ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎం. ఐ.ఐ.ఐ.ఎస్.ఈ.ఆర్. వంటి ప్రతిష్టాత్మకమయిన ఉన్నత విద్యా సంస్థలను మంజూరు చేసింది. వాటికి కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ శంఖుస్థాపన చేసారు. ఎంపిక చేసిన తాత్కాలిక భవనాలలో వాటి తరగతులు కూడా మొదలవుతున్నాయి. ఇవి కాక మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రి, అనంతపురం జిల్లాలో పాల సముద్రం వద్ద బెల్ సంస్థ, తూర్పు గోదావరి జిల్లాలో అంతర్వేది వద్ద డ్రెడ్జింగ్ కార్పోరేషన్ సంస్థ వంటి అనేక భారీ సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి.
ఇక విజయవాడ, విశాఖనగరాలలో మెట్రో రైల్ నిర్మాణానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజధాని నిర్మాణం కోసం భూమి చదును పనులు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జూన్ నెల నుండి అక్కడ నిర్మాణపనులు మొదలయ్యే అవకాశం ఉంది. అనంతపురం కర్నూలు పట్టణాలను రాజధానిని కలుపుతూ హైవే రోడ్ల నిర్మాణానికి కూడా కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆలాగే రాష్ట్రంలో మరికొన్ని జిల్లాలలో హైవేల నిర్మాణం, అభివృద్ధి కోసం కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కారి రూ. 60, 000 కోట్లు మంజూరు చేస్తునట్లు ప్రకటించేరు. విజయవాడ ప్రజల చిరకాల కోరిక దుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం కూడా మొదలయింది.
వీటన్నటిని మొత్తంగా కలిపి చూసినట్లయితే ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి పధం వైపు అడుగులు వేస్తున్నట్లు అర్ధమవుతుంది. అవన్నీ ఇంతవరకు శంఖుస్థాపనల వరకు వచ్చేయి. నూతన సంవత్సరంలో ఆ అభివృద్ధి పనులన్నీ మొదలయితే ప్రత్యక్షంగా చూడవచ్చును. కనుక 2015 కంటే రానున్న మూడు సంవత్సరాలు రాష్ట్రానికి చాలా కీలకమయినవిగా చెప్పుకోవచ్చును. వచ్చే మూడేళ్ళలో జరిగే అభివృద్ధిని బట్టి రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.