అతితెలివి ప్రదర్శించిన కాంగ్రెస్ అధిష్టానం
posted on Jan 29, 2014 @ 1:30PM
ఇంతవరకు రాజ్యసభ ఎన్నికలు కేవలం కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించిన వ్యవహారంగానే సాగింది. కానీ, కాంగ్రెస్ అదిష్టానం చాలా తెలివిగా సమైక్యవాది అయిన కేవీపీని, స్వయంగా శాసనసభ్యుల మద్దతు కూడగట్టుకోగల సుబ్బిరామి రెడ్డిని పార్టీ అభ్యర్ధులుగా నిలబెట్టి, ఈ మొత్తం వ్యవహారాన్నితనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నముఖ్యమంత్రి, ఆయన అనుచరులే ఒక కొలిక్కి తెచ్చేలా చేసి కాంగ్రెస్ అధిష్టానం చేతులు దులుపుకొంది. ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటు, ఆయన సమైక్య అనుచరులు, పార్టీ అభ్యర్దులు అందరూ కలిసి తిరుగుబాటు అభ్యర్ధులను, వారికి మద్దతు ఇస్తున్న శాసనసభ్యులను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం నుండి కాంగ్రెస్ అధిష్టానం తెలివిగా బయటపడగా, ఇంత కాలం అధిష్టానానికి వ్యతిరేఖంగా రంకెలు వేస్తున్నసీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ అధిష్టానం నిలబెట్టిన అభ్యర్ధులను గెలిపించుకొనే పనిలో తలమునకలయ్యున్నారు. పార్టీ అభ్యర్ధులు, స్వతంత్ర అభ్యర్ధుల గెలుపోటములు ఎలా ఉన్నపటికీ, ఈ ఎన్నికల వ్యవహారంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినా ఆశ్చర్యం లేదు.