మాటల గారడీ చేస్తున్నఉండవల్లి
posted on Jan 29, 2014 @ 11:24AM
నేడు రాజకీయాలలో మనుగడ సాధించాలంటే అంగబలం, అర్ధ బలంతోబాటు మంచి మాటకారితనం కూడా ఉంటే ఇక వారు పాడిందే పాట, చెప్పిందే వేదంగా చెలామణి అవుతుంది. ఒక న్యాయవాదికి మంచి మాటకారితనం ఉండి అతను రాజకీయాలలోకి ప్రవేశిస్తే ఇక చెప్పేదేముంది?
రాజమండ్రి యంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కోవలోకే వస్తారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకొన్నందున ఆయన పార్టీకి, పదవికీ కూడా రాజినామా చేసారు. తన నిబద్దతపై ప్రజలకు ఎటువంటి అనుమానాలు రాకుండా ఉండేందుకు వచ్చేఎన్నికలలో తాను పోటీ చేయబోనని ప్రకటించారు కూడా. అయితే, త్వరలో జరుగబోయే రాజ్యసభ ఎన్నికలకి ఆయన పేరు అటు పార్టీ తరపున, ఇటు సీమాంధ్ర తిరుగుబాటు కాంగ్రెస్ నేతల తరపున కూడా పరిశీలనలోకి రావడం విచిత్రమే!
నిన్నఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన కేవీపీ, సుబ్బిరామి రెడ్డిలను వెనకేసుకు వచ్చిన తీరు ఆయన మాటకారితనాన్ని మరోసారి బయటపెట్టింది. “కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేఖిస్తున్న మీరు, పార్టీ నిలబెడుతున్న కేవీపీ, సుబ్బిరామి రెడ్డిలకు మద్దతు ఇస్తారా? ఓడించమని పిలుపునిస్తారా?” అనే మీడియా ప్రశ్నకు జవాబు చెపుతూ, “కాంగ్రెస్ పార్టీని వ్యతిరేఖించడం, రాష్ట్ర విభజన చేయాలని అది తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేఖించడం రెండూ రెండు వేర్వేరు అంశాలు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖించిన వారందరూ పార్టీ అభ్యర్ధులను వ్యతిరేఖించవలసిన అవసరం లేదు. అలాగే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్న వారందరూ పార్టీని వీడిపోవలసిన అవసరం లేదు కూడా. ఒకవేళ పార్టీ విభజనవాదులయిన తెలంగాణా వ్యక్తులను ఎవరినయినా పోటీలో నిలబెట్టి, వారికి మద్దతు ఈయమని మమ్మల్ని కోరినట్లయితే తప్పకుండా వారిని ఓడించవలసి ఉంటుంది. కానీ కేవీపీ, సుబ్బిరామి రెడ్డి ఇద్దరూ కూడా పూర్తి సమైక్యవాదులే. కేవీపీ స్వయంగా ముందుండి సమైక్యపోరాటం చేసారు. అదేవిధంగా సుబ్బిరామి రెడ్డి కూడా సమైక్యవాదే! ఆయన తన వ్యాపార వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని ఆ మాట గట్టిగా పైకి చెప్పలేకపోతున్నారు, కానీ ఆయన చేయవలసిన ప్రయత్నాలు ఆయనా చేసారు. అందువల్ల వీరిరువురినీ పార్టీ నిలబెట్టిన కారణంగా వ్యతిరేఖించనవసరం లేదు,” అని స్పష్టం చేసారు.
“మరయితే వారిపై స్వతంత్ర అభ్యర్ధిగా పోటీగా దిగిన చైతన్యరాజుకి మీరు మద్దతు ఇస్తారా?” అనే ప్రశ్నకు బదులిస్తూ, “నిజానికి మా యంపీల కంటే శాసనసభ్యులే రాజకీయాలలో ఆరితేరినవారు. ఎందుకంటే వారు అటు ప్రజలతో, ఇటు పార్టీతో నిత్యం మంచి సంబందాలు కలిగి ఉంటారు. వారు ఎవరికి మద్దతు ఈయాలో మేము చెప్పనవసరం లేదు,” అని ఉండవల్లి జవాబు చెప్పడం ఆయన మాటకారితనానికి మరో ఉదాహరణగా నిలుస్తుంది.
కాంగ్రెస్ అధిష్టానం చాలా తెలివిగా ఎంపికచేసిన అభ్యర్ధులను ఎవరూ కాదనలేని పరిస్థితి కల్పించడమే కాదు, వారి ద్వారా ఉండవల్లి వంటి అసమ్మతి నేతలను కూడా దారిలోకి తెచ్చుకోగలిగింది. అందుకే పార్టీ నిలబెట్టిన అభ్యర్ధులకు ముఖ్యమంత్రి మొదలు ఉండవల్లివరకు అందరూ కూడా కాదనకుండా మద్దతు ఈయవలసి వస్తోంది. దీనినే కర్ర విరగకుండా, పాము చావకుండా కధ నడిపించడం అంటారేమో! ప్రస్తుతం ముఖ్యమంత్రి, బొత్స ఇరువురూ కలిసి తిరుగుబాటు అభ్యర్ధులను వారికి మద్దతు ఇస్తున్న వారిని బుజ్జగించే ప్రయత్నాలలో ఉన్నట్లు తాజా సమాచారం. కాంగ్రెస్ తెలివితేటలకి ఇంత కంటే గొప్ప ఉదాహరణ ఏమి కావాలి?