ఆదాల, చైతన్యరాజుల నామినేషన్ లు ఓకే
posted on Jan 29, 2014 @ 3:50PM
రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలోకి దీగిన చైతన్యరాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. దీంతో రాష్ట్రంలోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్ధులు పోటీలో వున్నారు. స్వతంత్ర అభ్యర్ధులకు మద్దతిచ్చిన ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకున్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేయడంతో... మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల నుంచి లిఖితపూర్వకంగా లేఖలు తీసుకురావాంటూ రెబల్ అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి గంట సమయం ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధి కేవీపీ రామచంద్రరావు స్వతంత్ర అభ్యర్ధులకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ భవనంలో తన వద్దే ఉంచుకున్నారు. దీంతో కాసేపు ఉత్క౦ఠ నెలకొంది. చివరికి స్వతంత్ర అభ్యర్ధుల నామినేషన్ల పై బొత్స అభ్యంతరాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.
చివరికి న్యాయం గెలిచిందని చైతన్య రాజు అన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ఎన్నికలలో తాము తప్పనిసరిగా గెలుస్తామని చెప్పారు. చాలామంది సమైక్యాంధ్రకు మద్దతుగా తమకు ఓటు వేస్తారన్నారు. తమకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలు అన్నీ చదివాకే సంతకాలు చేశారన్నారు. కాంగ్రెస్ నేతలు బొత్స, కెవిపి లు గట్టిగా ప్రయత్నించినా చివరికి వారి వ్యూహం విఫలం అయింది.