సీతక్కే సీఎం?
posted on Jul 11, 2023 9:20AM
తెలంగాణలో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు? కాంగ్రెస్ లో గ్రూపులు, విభేదాలు, నాయకుల మధ్య అనైక్యత గురించి తెలిసిందే. ఎన్నికల ముందు ఐక్యంగా కదిలినా ఫలితాలు వచ్చిన తరువాత పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుందని, ఇందుకు ఆ పార్టీ గతాన్ని పరిశీలిస్తే సరిపోతుందని పరిశీలకులు అంటున్నారు. కర్నాటకలో సాధించిన ఫలితంతో ఇప్పుడు కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తున్నది. అంతకు ముందు వరకూ నిస్తేజంగా కనిపించిన పార్టీ శ్రేణులు ఇప్పుడు గెలుపు ధీమాతో కదంతొక్కుతున్నాయి.
పరిశీలకులు కూడా బీఆర్ఎస్ బీజేపీలో రెండో స్థానం కోసం పోటీ పడాల్సిందేనని విశ్లేషిస్తున్నారు. అయితే కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ సీఎం ఎవరు అన్నదే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా జరుగుతున్న చర్చ. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరమీదకు వస్తే.. పార్టీలోనే సహాయ నిరాకరణ ఉంటుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పుడు మారిన మనిషిగా కనిపిస్తున్నారు. పార్టీలో తన వ్యతిరేకులందరినీ కలుపుకుని పోవడమే కాకుండా.. తనంత తానుగా స్వయంగా వచ్చే ఎన్నికలలో పార్టీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా సీతక్క పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని ప్రకటించారు.
రేవంత్ ప్రకటనతో పార్టీలో సీఎం పదవి కోసం రేసు లేకుండా పోయిందని పరిశీలకులు అంటున్నారు. సీతక్క ముఖ్యమంత్రి అంటే ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పార్టీ నేతలంతా అంగీకరించి తీరాల్సిన పరిస్థితిని రేవంత్ తన ప్రకటన ద్వారా తీసుకువచ్చారని అంటున్నారు. రేవంత్ ప్రకటన పట్ల బడుగు,బలహీన వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతున్నది.మహిళలు మద్దతుగా నిలుస్తారనడంలో సందేహం లేదు. త్వరలో తెలంగాణ రాష్ట్రం లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ సీఎం అభ్యర్థి గా ఉంటారని అమెరికా లో జరుగుతున్న తానా సభల్లో టిపిసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి సీతక్క ఉంటారా అనే ప్రశ్న కు జవాబుగా రేవంత్ రెడ్డి కాదు సీఎంగా అని విస్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ లో సీఎం అభ్యర్థి ని ఎన్నికలకు ముందే ప్రకటించే ఆనవాయితీ ఇంత వరకూ లేదు. రేవంత్ ప్రకటన కూడా అధిష్ఠానం అధికారిక ప్రకటనగా భావించలేం. అయితే.. రేవంత్ వ్యూహాత్మకంగా సీతక్క పేరును తెరమీదకు తీసుకురావడం ద్వారా .రాష్ట్రం లోని కాంగ్రెస్ లో గ్రూపుల కు చెక్ పెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నిజానికి 2023 లోని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా ప్రణాళికలు తో ముందుకు వెళ్లే అవకాశం ఉందని.అన్ని పరిస్థితులను పార్టీకి అనుకూలంగా చేసుకునే ఏ అవకాశాన్నీ రేవంత్ రెడ్డి వదలడం లేదు. సీఎం తానే కావాలనే లక్ష్యం కాకుండా పార్టీ ని అందరి తో కలిసి అధికారంలోకి తీసుకొని రావాలనే లక్ష్యంతో ఉన్నారని సీతక్క సీఎం అనడం ద్వారా విస్పష్టంగా చాటారు. గడచిన తొమ్మిది సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ లో ఐక్యతారాగం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ ఉపాధ్యక్షురాలు ఆదివాసీ బిడ్డ,మాజీ నక్సలైట్,సీతక్క పేరును ప్రకటించడం ద్వారా రేవంత్ కేసీఆర్ కు పెద్ద ఝలక్ ఇచ్చారనే చెప్పాలి. ఆయన 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ (అప్పడు తెరాస) విజయం సాధిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. గెలిచిన తరువాత ఆయన మళ్లీ ఆ ఊసే ఎత్తలేదు. వరుసగా రెండు సార్లు గెలిచి సీఎం అయ్యారు. హ్యాట్రిక్ విజయం కోసం ఆశపడుతున్నారు. గెలిస్తే ఆయనో లేదా ఆయన తనయుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆరో సీఎం అవుతారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో రేవంత్ దళిత మహిళను సీఎం అభ్యర్థిగా ప్రకటించి బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చారనే చెప్పాలి. కరోనా సందర్బంగా సీతక్క చేసిన సేవలు,స్వయంగా భోజనం మోసుకుని వెళ్లడం వంటి సేవా కార్యక్రమాలు ఆమెకు జనబాహుల్యంలో అంతులేని అభిమానాన్ని సంపాదించి పెట్టాయి. మానవీయ కోణం ఉన్న విద్యా వంతురాలిగా సమాజంలోని అన్ని వర్గాలూ ఆమెను అభిమానిస్తాయి, గౌరవిస్తాయి. విపక్షాలు కూడా ఆమెను విమర్శించేందుకు సాహసించరు. అదీ సీతక్క వ్యక్తిత్తం. ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రకటన కాంగ్రెస్ లో ఒక్క సారిగా జోష్ నింపింది. ఎన్నికలలో విజయంపై ధీమా పెరిగింది.