కాంగ్రెస్ బీసీ మంత్రం
posted on Jul 18, 2023 6:29AM
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం తరువాత తెలంగాణలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకున్న విషయం తెలిసిందే. గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయిల్లో పార్టీ శ్రేణులు యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరడం అదనపు బలం చేకూరినట్లయింది. వీరికి తోడు మరికొందరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించారు. తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని పలు సందర్భాల్లో రాహుల్ పేర్కొంటూ వస్తున్నారు. రాహుల్ గాంధీ అంత ధీమాగా చెప్పడానికి కారణం సర్వేల నివేదికలేనని తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ విజయం పక్కా అని తేలిదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కాంగ్రెస్‌తోనే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నరని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విబేధాలు కేసీఆర్‌కు కలిసొచ్చాయనే చెప్పొచ్చు. ఈసారి ఆ అవకాశాన్ని కేసీఆర్‌కు ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలంతా ఐక్యతా రాగాన్ని అందుకున్నారు. నేతలంతా ఒకేమాటపై ఉంటూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల దాడిచేస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం వ్యూహాలను తిప్పికొడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటుండగా.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రోజురోజుకు జోష్ పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఆయా సామాజిక వర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆ రెండు సామజిక వర్గాల ఓటర్లు ఎక్కువగా కాంగ్రెస్ వెంటే ఉంటూ వస్తున్నారు. మిగిలిన వారినిసైతం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికేలా కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నది. దీనికితోడు తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుడే తెలంగాణ సీఎం అవుతాడని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తరువాత ఆ హామీని తుంగలో తొక్కారు. మరోవైపు దళితులకు మూడెకరాల భూమి అని చెప్పి కేసీఆర్ కేవలం కొద్ది మందికి మాత్రమే ఇచ్చి ఆ పథకానికి ఎగనాం పెట్టారు. దళిత బంధు విషయంలో దాదాపు అదే పరిస్థితి. ఈ విషయాలపై ఎస్సీ ఓటర్లలో చైతన్యం నింపి వారిని కాంగ్రెస్ వైపు తిప్పుకొనేలా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టింది.
మరోవైపు.. ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణలో పోరాటాలు సాగుతున్న పోడు భూముల సమస్యకు ఈ మధ్యనే కేసీఆర్ సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పెద్ద సంబురంగా జరిపించింది. దీంతో ఎస్టీ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు బీఆర్ఎస్ అదిష్టానం గట్టి ప్లానే వేసింది. దీనికి విరుగుడుగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్టీలకుకూడా భారీ ఆర్ధిక సాయం అందించే పథకం తెస్తామని ఆ పార్టీ నేతలు హామీ ఇస్తున్నారు. ఆ రెండు సామాజిక వర్గాలకు తోడు బీసీ వర్గాలపైనా కాంగ్రెస్ గురిపెట్టింది. తెలంగాణలో బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. అనేక నియోజకవర్గాల్లో గెలుపోటములపై వీరి ప్రభావం ఎక్కువే. బీసీ ఓటర్లు అధికంగా ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే నియోజకవర్గాలుకూడా ఉన్నాయి. దీంతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో బీసీలకు పెద్దపీట వేస్తామని ఇప్పటికే ఆ పార్టీ నేతలు చెప్పారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గర్జన సభలు నిర్వహించేందు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.
బీసీ గర్జన సభల్లో భాగంగా తొలుత పలు జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఈనెల 19న సంగారెడ్డిలో, 21న కరీంనగర్, 23న నిజామాబాద్, 24 అదిలాబాద్ జిల్లాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ నేత వీహెచ్ ప్రకటించారు. అయితే, ఈ సన్నాహక సమావేశాలకు రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యలను ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ వర్గాలను విస్మరించిందని పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని, బీసీల అభివృద్ధికోసం అమలు చేసే పథకాలను సైతం ఈ సమావేశాల్లో వివరించే అవకాశం ఉంది. మొత్తానికి ఎస్సీ, ఎస్టీ ఓట్లపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం తాజాగా బీసీ వర్గాల ఓట్లపైనా ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలు సక్సెస్ అయితే, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ విజయం నల్లేరుపై నడకేనని పరిశీలకులు పేర్కొంటున్నారు.