బెడిసికొట్టిన బీఆర్ఎస్ వ్యూహం.. కాంగ్రెస్‌కు పెరిగిన క్రేజ్
posted on Jul 18, 2023 6:06AM
తెలంగాణలో మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకు ఈసీ ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఈ క్రమంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్, బీజేపీలు వాటి వాటి వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ముందు వరకు తెలంగాణలో మరోసారి అధికారం మాదే అని భావించిన బీఆర్ఎస్ నేతల్లో ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతున్నది.
కర్ణాటకలో విజయం తరువాత తెలంగాణలోనూ కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర పెద్దలు సైతం తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించడంతో బీఆర్ఎస్‌లో కంగారు మొదలైంది. గతంలోలా కాంగ్రెస్ నేతల మధ్య చీలిక తెచ్చి పార్టీ బలాన్ని నిర్వీర్యం చేయాలనుకున్న సీఎం కేసీఆర్ ఆశలు అడియాశలయ్యాయి. కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలంతా ఏకతాటిపైకి వచ్చారు. కేసీఆర్‌ను గద్దెదించడమే లక్ష్యం అంటూ నేతలు గంటాపథంగా చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీనేతల ఐకమత్యంగా అధికార పార్టీపై పోరాడుతుండటంతో గ్రామ స్థాయి నుంచి పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్వ వైభవం దిశగా సాగుతోందా అనిపించేలా వాతావరణం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో బదనాం చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలో అమెరికాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధిష్టానం తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించింది. అయితే అధికార పార్టీ వ్యూహం బెడిసికొట్టింది. రేవంత్ రెడ్డి రైతులకు కేవలం మూడు గంటల పాటే ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పారని, రైతులంటే కాంగ్రెస్‌కు గిట్టదని అర్థమైందని, రైతులంతా కాంగ్రెస్ పార్టీ నేతలను నిలదీయాలంటూ బీఆర్ఎస్ నేతలు ప్రెస్‌మీట్లు పెట్టిమరీ చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ స్టేషన్ల వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసనకు సైతం దిగారు. అయితే బీఆర్ఎస్ వ్యూహాన్ని కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు. రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ బీఆర్ఎస్ రైతుల మెప్పు పొందాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన రేవంత్ సైతం బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్త చేశారు. తన వ్యాఖ్యలను పూర్తిస్థాయిలో కాకుండా బీఆర్ఎస్ అధిష్టానం వారికి అనుకూలంగా కట్ అండ్ పేస్ట్ పద్ధతిలో వీడియో విడుదల చేసిందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యలను రేవంత్ మీడియా ముందు మరోసారి వెల్లడించారు. 24గంటల విద్యుత్ పేరుతో కేసీఆర్ కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్నారని రేవంత్ చెప్పారు. 24గంటల ఉచిత విద్యుత్ పేరుతో ఏడాదికి 16వేల కోట్లు కేటాయిస్తున్న కేసీఆర్.. కేవలం ఎనిమిది గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, ఈ మాత్రం విద్యుత్ ఇవ్వటానికి కేవలం 8వేల కోట్లు మాత్రమే సరిపోతాయని రేవంత్ చెప్పారు. కానీ, ఉచిత విద్యుత్ పేరుతో కోట్లాది రూపాయలు కేసీఆర్ దోపిడీ చేస్తున్నారని ప్రజలకు వివరించారు. దీనికితోడు బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు గట్టి కౌంటర్ ఇస్తుండటంతో బీఆర్ఎస్ బడా నేతలు తలలు పట్టుకుంటున్నారట. బీఆర్ఎస్ లేవనెత్తిన ఉచిత విద్యుత్ అంశం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకే క్రేజ్ పెంచిందని అధికార పార్టీ నేతలు వాపోతున్నారని పరిశీలకులు చెబుతున్నారు. అయితే, బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం తన పంతాన్ని నెగ్గించుకొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. కాంగ్రెస్ నేతలు సైతం బీఆర్ఎస్ వ్యూహాలను తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారు.
ఉచిత విద్యుత్ అంశంపై అమెరికాలో రేవంత్ వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు నిరసనలు తెలిపినా ప్రజల్లో పెద్దగా స్పందన కనింపించలేదని బీఆర్ఎస్ హైకమాండ్ గుర్తించడంతో ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే మరో అంశాన్ని లేవనెత్తింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం వైఎస్ఆర్ హయాంలో తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇప్పుడున్న కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ అని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్, హరీష్ రావులు రేవంత్ రెడ్డి చోటా చంద్రబాబు అంటూ విమర్శించడం మొదలు పెట్టారు. అయితే, బీఆర్ఎస్ కొత్తగా లేవనెత్తిన అంశంపైనా కాంగ్రెస్ నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆ పార్టీలో ఉన్న సగం మంది మంత్రులు టీడీపీ నుంచి వచ్చినవారేనని. పోచారం శ్రీనివాసరెడ్డి చంద్రబాబు పంచన లేడా? దయాకర్ రావు చంద్రబాబు పంచన లేడా? తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబు పంచన లేడా? అంటూ కాంగ్రెస్ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. చంద్రబాబు దయా దక్షిణ్యాలతోనే బీఆర్ఎస్ నేతలకు రాజకీయ భిక్ష అని, కేసీఆర్ మంత్రి వర్గం మొత్తం టీడీపీలోనే పుట్టిందంటూ కాంగ్రెస్ నేతలు కేటీఆర్, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై ఎటాక్ మొదలు పెట్టారు. మొత్తానికి బీఆర్ఎస్ ఏ అంశాన్ని లేవనెత్తినా కాంగ్రెస్ నేతలు ఐక్యంగా కౌంటర్ ఇస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది. ఇదే రీతిలో కాంగ్రెస్ నేతలు ముందుకు సాగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం పక్కా అంటూ విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.