కాంగ్రెస్ నష్టబోతున్నా ముందుకే ఎందుకు

 

రాష్ట్ర విభజన అంశంతో ప్రతిపక్షపార్టీలను దెబ్బతీయబోయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో చాలా దెబ్బతింది. అయినా కూడా వెనకడుగువేసే ప్రసక్తే లేదని చెపుతూ అందుకు అనుగుణంగా రాష్ట్రంలో జగన్ ద్వారా ఉద్యోగులలో, అనం, డొక్కావంటి మంత్రులద్వారా తన స్వంత పార్టీలో చీలికలు సృష్టించేందుకు చురుకుగా పావులు కదుపుతోంది. దీనివలన పార్టీ రెండు ప్రాంతాలలో తీవ్రంగా నష్టపోతుందని తెలిసినా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఇంత మొండిగా ముందు సాగుతోంది? ఇది ఆ పార్టీ అవివేకమా? లేకపోతే అతి తెలివితేటలనుకోవాలా?అని ఆలోచిస్తే రెండూ కాదు, చాలా దూరాలోచన అని అర్ధం అవుతుంది.

 

ఏవిధంగా అంటే, కాంగ్రెస్ అధిష్టానం దృష్టి ఇప్పుడు రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడం కంటే కేంద్రంలో అధికారం సాధించడంపైనే ఎక్కువుంది. ఇక్కడ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఆ పార్టీకి పెద్దగా నష్టం లేదు, కానీ కేంద్రంలో కోల్పోతే మాత్రం ఆ తరువాత వచ్చే నరేంద్ర మోడీ ముందే హెచ్చరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కోలుకోని విధంగా ఘోరంగా దెబ్బ తీయడం ఖాయం. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కలలు కంటున్నకాంగ్రెస్ అధిష్టానం, ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్నిమోడీకి వదులుకోలేదు. వదులుకొంటే అది కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యతో సమానం.

 

అవసరమయితే రాష్ట్రాన్ని వదులుకోవచ్చు కానీ కేంద్రాన్ని మాత్రం కాదు. ఒకవేళ కేంద్రంలో ఓడిపోయి, రాష్ట్రంలో గెలిచినా దానివల్ల కాంగ్రెస్ అధిష్టానానికి పెద్దగ ఒరిగేదేమీ ఉండదు. గనుక కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పరిచేందుకు అవసరమయిన యంపీ సీట్లను తప్పనిసరిగా రాష్ట్రం నుండే పోగేసుకోక తప్పదు. అయితే ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్నిఒక్కటిగా ఉంచినా, ముక్కలు చేసినా కాంగ్రెస్ పార్టీ రెండు చోట్లా గెలిచే అవకశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. గనుక కనీసం తనకు మద్దతునిచ్చే పార్టీలు వైకాపా, తెరాసలకు అధికారం దక్కినా అది తనకు దక్కినట్లేనని కాంగ్రెస్ భావన కావచ్చును.

 

అందుకే రాష్ట్రoలో పార్టీ సర్వనాశనం అవుతోందని ఆ పార్టీ నేతలు ఎంత గగ్గోలుపెడుతున్నా పట్టించుకోవట్లేదని లేదని చెప్పవచ్చును. అదేవిధంగా రెండు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచితే ఇన్నిసీట్లు, విడదీస్తే ఇన్ని సీట్లు సాధించి ఇస్తామని చెపుతున్న మాటలని కూడా విశ్వసించకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో తన ఓటమి ఖాయమని అందుతున్నఇంటలిజన్స్ నివేదికలేనను కావచ్చును.

 

ఈ గొప్ప రహస్యం చెప్పేందుకు ఇంటలిజన్స్ నివేదికలే అవసరం లేదు రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెపుతారు. అందుకే కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ అధిష్టానం, అందుకోసం రాష్ట్రంలో అధికారాన్ని వదులుకొనేందుకు కూడా సిద్దపడుతోందని చెప్పవచ్చును.

 

మరి కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఈ దూర దురాలోచానకు రాష్ట్ర ప్రజలు ఎందుకు భారీ మూల్యం చెల్లించాలన్నదే ప్రశ్న.