బీజేపీ వైపు మళ్ళిన రాష్ట్ర రాజకీయాలు
posted on Oct 1, 2013 @ 9:32AM
రాష్ట్ర విభజన అంశంపై రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య యుద్ధం జరుగుతున్ననేపధ్యంలో దీనికంతటికీ మూల కారణమయిన కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరగవలసిన రాజకీయాలు,ఇప్పడు అకస్మాత్తుగా బీజేపీ చుట్టూ తిరగడం మొదలయింది. నిన్నమొన్నటి వరకు రాష్ట్రంలో రాజకీయ పార్టీలేవీ కూడా ఆ పార్టీని అసలు లెక్కలోకే తీసుకోలేదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఆ పరిస్థితి మారింది.
మొదట, నరేంద్ర మోడీ తేదేపాతో స్నేహాసంకేతాలు పంపడంతో ఈ మార్పు మొదలయింది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు కూడా అందుకు సానుకూలత చూపుతునట్లు వ్యవహరిస్తుండటంతో రాష్ట్రంలో మిగిలిన పార్టీలు ఉలిక్కిపడ్డాయి. రేపు ఢిల్లీలో ‘సిటిజన్ కౌన్సిల్ ఫర్ అకౌంటబులిటి గవర్నన్స్’ నిర్వహిస్తున్న ఓ సమావేశంలో చంద్రబాబు, మోడీ ఒకే వేదికపై కలువనున్నారు. ఇది ఆ రెండు పార్టీలు క్రమంగా దగ్గరవుతున్నాయని సూచిస్తోంది.
ఇక ఇంతకు ముందు బీజేపీతో అసలు పొత్తుల ఆలోచనే ఉండదని నిర్ద్వందంగా ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీ చంద్రబాబులా మాటిమాటికి ‘యూ’ టర్న్ తీసుకోదని చెపుతూనే, తమ పార్టీ సెక్యులర్ పార్టీగానే ఉంటుందని గట్టిగా చెపుతూనే, నరేంద్ర మోడీని మంచి పరిపాలనాధ్యక్షుడని పొగడటం, ఆయన అన్నిరాజకీయ పార్టీలను సెక్యులర్ వేదికపైకి వచ్చేలా కృషిచేయాలని కోరడం, రానున్న ఎన్నికల తరువాత కేంద్రంలోఏ కూటమిని సమర్ధించాలానే విషయంలో తమ లెక్కలు తమకున్నాయని చెప్పడం చాలా ఆశ్చర్యకరమయిన మార్పు(యూ టర్న్?)గా చెప్పవచ్చును.
ఇక తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి ‘బీజేపీ బూచి’ని చూపిస్తూ తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకొనేలా చేయగలిగాడు. మళ్ళీ మొన్న హైదరాబాదులో జరిగిన సకలజన భేరి సభలో కూడా కాంగ్రెస్ కాకపోతే బీజేపీ ఉండనే ఉందని మరో మారు ప్రకటించారు.
ఈవిధంగా రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు కూడా ఒకేసారి బీజేపీ వైపు చూడటం చాలా ఆశ్చర్యకర పరిణామమే. బహుశః రానున్న ఎన్నికలలో నరేంద్ర మోడీ అద్వర్యంలో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచే అవకాశాలున్నట్లు భావించడంవల్లనే మూడు పార్టీలు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయని భావించవవచ్చును.
అయితే ఈ మూడు పార్టీలకు మళ్ళీ వేటి కారణాలు వాటికున్నాయి. కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వకపోతే బీజేపీ ద్వారా సాధించుకోవాలని తెరాస, జగన్మోహన్ రెడ్డిపై ఉన్నసీబీఐ కేసుల దృష్ట్యా బీజేపీకి మద్దతు ఈయవలసిన అవసరం గుర్తించిన వైకాపా, ఒకవేళ కాంగ్రెస్ తెరాస, వైకాపాలతో జత కట్టినట్లయితే, రెండు ప్రాంతాలలో తన బలం పెంచుకొనేందుకు తెదేపా, బీజేపీ వైపు చూస్తున్నాయని చెప్పవచ్చును. అంతే గాక జాతీయ స్థాయిలో ఈ మూడు పార్టీలు చక్రం తిప్పాలనే కోరిక కూడా ఆ పార్టీ వైపు ఆకర్షింపజేస్తోందని చెప్పవచ్చును.
ఏమయినప్పటికీ ఇది బీజేపీకి చాలా కలిసివచ్చే అంశం. రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు వాటివాటి అవసరాల కోసం మద్దతు ఇస్తే, బీజేపీ మాత్రం ఎందుకు కాదంటుంది? అయితే, రాష్ట్రంలో పొత్తుల విషయంలో బీజేపీ ఏ పార్టీ తనకు మంచి ఆఫర్ ఇస్తుందో దానికే ప్రాధాన్యం ఈయవచ్చును. అయినప్పటికీ, ఒకవేళ బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచే పరిస్థితి ఏర్పడితే, ఈ మూడు పార్టీల సహాయం తీసుకోవచ్చును.
అయితే మోడీ ఈ మూడు కత్తులను ఒకే ఒరలో ఇముడ్చుకొని నేర్పుగా తన పని చక్కబెట్టుకోవలసి ఉంటుంది. మోడీకి అది వెన్నతో పెట్టిన విద్యే.