జగన్ చేతిలో కాంగ్రెస్ హస్తం నలిగిపోనుందా
posted on Sep 27, 2013 @ 11:41AM
రాజాం యంపీ సాయి ప్రతాప్, అమలాపురం యంపీ హర్షకుమార్, విజయవాడ యంపీ లగడపాటి అందరూ నిఖార్సయిన కాంగ్రెస్ వాదులే. అయినా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆదిష్టాన వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. సిద్ధాంతాల ప్రకారం ముందుకు సాగల్సిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రానున్నఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓట్లు,సీట్లు ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవడం చాలా శోచనీయమని సాయి ప్రతాప్ అన్నారు. దీనివలన తాత్కాలికంగా పార్టీ కొంత ప్రయోజనం పొందినా దీర్గ కాలంలో తీవ్రంగా నష్టపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక దివాకర్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకు వేసి, రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ మిగిలి ఉంటే కదా! ఎన్నికలలో పోటీ చేయడానికి? అన్నారంటే కాంగ్రెస్ పరిస్థితి అర్ధం అవుతోంది. ఇక హర్షకుమార్ మాట్లాడుతూ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి కోసం ఏకంగా పార్టీనే బలి చేస్తోందని, కాంగ్రెస్ పార్టీకి వైకాపాలు రెండు తెర వెనుక కుమ్మక్కు అయ్యాయా లేదా అనే సంగతి రాష్ట్రంలో ఇప్పుడు చిన్న పిల్లాడిని అడిగినా చెప్పగలడని అన్నారు.
సమైక్యాంధ్ర పేరుతో పావులు కదుపుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్నివిడగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని, అందుకే తన పార్టీ యం.ఎల్.ఏ.లతో రాజినామాల డ్రామా మొదలుపెట్టడాని, అతనితో చేతులు కలిపి కాంగ్రెస్ అధిష్టానం పార్టీని రాష్ట్రంలో భ్రష్టు పట్టిస్తోందని, తమ రాజకీయ జీవితాలతో చెలగాటమాడుతోందని ఆయన ఆరోపించారు.
అదేవిధంగా సమైక్యవాదిగా ముద్రపడ్డ లగడపాటి కాంగ్రెస్-వైకాపాల మధ్య ఉన్న అనైతిక బంధం గురించి మీడియా ప్రశ్నించినపుడు ఆ విషయంపై ఇప్పుడేమి మాట్లాడలేనని, కానీ తమ రాజీనామాలు ఆమోదింపజేసుకొన్న తరువాత చాలా విషయాలు బయటపెడతానని అయన అన్నారు. అంటే ఆయన కూడా కాంగ్రెస్-వైకాపాల మధ్య జరిగిన రహస్య ఒప్పందాలను ఖండించడం లేదని, త్వరలోనే ఆయన కూడా అధిష్టానంపై బాంబులు వేయబోతున్నారని స్పష్టం అవుతోంది.
ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అధిష్టానానికి వ్యతిరేఖంగా మొన్న మరో మారు గళం విప్పారు. ప్రజాభీష్టానికి వ్యతిరేఖంగా, ప్రజాందోళనలను ఖాతరు చేయకుండా ముందుకు సాగితే రాష్ట్రంలో పార్టీ బ్రతికి బట్ట కట్టడం అసాధ్యమని ఆయన మీడియా ముందే మరో మారు కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు.
కాంగ్రెస్ అధిష్టానం తలచిందొకటి, కానీ జరుగుతున్నది మరొకటి. రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలను భూస్థాపితం చేద్దామనుకొంటే, ఇప్పుడు పార్టీలోనే తీవ్ర వ్యతిరేఖతను ఎదుర్కోవలసి వస్తోంది. తనను వ్యతిరేఖిస్తున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, సీమంధ్ర నేతలను కట్టడి చేయడానికి, జగన్మోహన్ రెడ్డికి బెయిలు ఇచ్చి రంగంలోకి దింపితే, అది మరింత వ్యతిరేఖతను పెంచింది. ఇంతవరకు కేవలం రాష్ట్ర విభజన కారణంగానే కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేఖిస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారణంగా నేరుగా పార్టీ అధిష్టాన్నానే ధిక్కరిస్తున్నారు.
దీనికంతటికీ కారణం కాంగ్రెస్ అధిష్టానం యొక్క రాజకీయ దురాశ, అతి తెలివి తేటలు, రాష్ట్ర సమస్యల పట్ల అవగాహణా లోపమే. అందువల్లే ఒక సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మరిన్నికొత్త సమస్యలు సృష్టించుకొంటోంది. బహుశః దీనినే వినాశకాలే విపరీత బుద్ధి అని అనాలేమో!