ఆ గౌరవమే పీఆర్పీ ఎమ్మెల్యేలకూ
posted on Jun 25, 2011 @ 4:06PM
కర్నూలు: కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులకు దక్కే గౌరవం, ప్రాధాన్యమే ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు ఇస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. అందుకే ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు కాటసాని రాంరెడ్డికి ప్రాధాన్యం ఇచ్చామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో కాటసాని రాంరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడంపై మాజీ శాసనసభ్యుడు చల్లా రామకృష్ణా రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. ఆయన బహిరంగ సభకు చల్లా రామకృష్ణా రెడ్డి వర్గీయులు హాజరు కాలేదు. దీనిపై ప్రతిస్పందనగానే ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలు చేశారు. విద్యావంతులకు సంవత్సరానికి 3 లక్షల చొప్పున మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాలను ఇస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శనివారం బనగానపల్లెలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. 20 లక్షలమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 3,500 కోట్ల రూపాయలు, ఓసీలకు 390 కోట్ల రూపాయల ఉపకార వేతనాలు మంజూరు చేశామన్నారు. విద్యాపక్షోత్సవాల్లో భాగంగా చదువుపై 2500 కోట్ల రూపాయలు వ్యయం చేశామన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యాబోధన ఉంటుందన్న నమ్మకాన్ని తాము కలిగిస్తామన్నారు.