పెట్రో ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన
posted on Jun 25, 2011 @ 4:24PM
హైదరాబాద్: పెట్రో ఉత్పత్తుల ధరల పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ప్రదర్శనలు జరిగాయి. పెరిగిన డీజిల్, గ్యాస్, కిరోసిన్ ధరలు వెంటనే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు డిమాండ్ చేశాయి. ధరల పెరుగుదలకు నిరసనగా శనివారం వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. పెట్రో, గ్యాస్ ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతున్నదని సర్వాత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లో ధరల పెంపునకు నిరసనగా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో టీడీపీ ధర్నా నిర్వహించింది. యూపీఏ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఖమ్మం జిల్లాలో డీజిల్, గ్యాస్ పెంపునకు నిరసనగా బుగ్గివాగు బ్రిడ్జిపై సీపీఐ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. మయూరి సెంటర్ వద్ద న్యూడెమోక్రసీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
వరంగల్ జిల్లాలో గ్యాస్, కిరోసిన్ ధరలు తగ్గించాలంటూ భూపాలపల్లి అంబేద్కర్ సెంట్రల్‌లో టీడీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. గుంటూరు జిల్లాలో పెట్రోల్ ధర పెరుగుదలకు నిరసనగా బాపట్ల జీబీసీ రోడ్‌లో సీపీఐ నేతలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. విజయవాడలో పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా గన్నవరంలో టీడీపీ రాస్తారోకో, వంటావార్పు నిర్వహించింది. దీంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. విశాఖపట్నంలో పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా మద్దిలపాలెం, జగదాంబ సెంటర్ వద్ద సీపీఐ ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టింది.