వలంటీర్ల పై రచ్చ.. తెలుగుదేశంకు లాభించిందా?
posted on Jul 22, 2023 @ 12:54PM
పవన్ కల్యాణ్ వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ హీట్ ను విపరీతంగా పెంచేశాయి. వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యల రచ్చ.. జనసేన, వైసీపీల మధ్య మాటల రణాన్ని పీక్స్ కు తీసుకు వెళ్లింది. ముఖ్యమంత్రి జగన్ కూడా హోదాను తగ్గించుకుని మరీ బూతు పురాణాన్ని విప్పేశారు. మొత్తంగా ఏపీలో రాజకీయ వాతావరణం అంతా జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారిపోయింది.
దీంతో పొలిటికల్ ఫైట్ జనసేన, వైసీపీల మధ్యే అన్నట్లుగా సీన్ మారిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ను తగ్గించేందుకు బీజేపీ అనుసరించిన వ్యూహమే ఇక్కడ ఆ పార్టీ ప్రోత్సాహంతో, ప్రమేయంతో జగన్ అనుసరించి తెలుగుదేశం పెద్దగా వార్తలలో నిలవకుండా నియంత్రించేందుకు అమలు చేశారని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. వాస్తవానికి పై నుంచి చూసే వారికి కూడా నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం, వైసీపీల మధ్యే పోరు అన్నట్లుగా ఉన్న వాతావరణం పవన్ కల్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్రలో భాగంగా స్వరం పెంచి అధికార పార్టీపై విమర్శల దాడిని, వేడినీ పెంచారో అప్పటి నుంచీ సీన్ మొత్తం పవన్ వర్సెస్ జగన్ అన్నట్లుగా మారిపోయింది.
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై విమర్శలతో మొదలు పెట్టి.. వాలంటీర్లపై వ్యాఖ్యల దాకా పవన్ అధికార వైసీపీని, జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేసి పొలిటికల్ మైలేజ్ సంపాదించేశారని అనిపించే పరిస్థితి నెలకొంది. పవన్ కల్యాణ్, జగన్ ల మాటల యుద్ధం వెనుక ఉన్నది బీజేపీ వ్యూహమన్నది పరిశీలకుల విశ్లేషణ కాగా, ఆ వ్యూహం కారణంగా రాష్ట్రంలో తెలుగుదేశం వెనుకబడిందన్న అంచనాలు కూడా వెలువడుతున్నాయి. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని వైసీపీ, జనసేన వర్గాలే చెబుతున్నాయి. పొలిటికల్ హీట్ పెరిగేలా జనసేన, వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే.. ఆ రచ్చలో వేలు పెట్టకుండా తెలుగుదేశం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం అవుతోందని అంటున్నారు. ఎ
న్నికలలో సత్ఫలితాలు సాధించేందుకు మిగిలిన అన్నివిషయాల కంటే అత్యంత ప్రధానమైనది క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం అయ్యే చర్యలు చేపట్టడమేనన్నది అందిరికీ తెలిసిన విషయమే. అయితే తెలుగుదేశం పార్టీని డిఫెన్స్ లో పడేయాలన్న ఏకైక లక్ష్యంతో వైసీపీ ఆ పనిని వదిలేసి తమ ప్రధాన ప్రత్యర్థి జనసేన మాత్రమేనని ఎస్టాబ్లిష్ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతూ వ్యూహాలను అమలు చేస్తున్నది. ఈ వ్యూహాలకు బీజేపీ అన్ని విధాలుగా అండదండలు అందించడమే కాకుండా.. తన మిత్ర పక్షమైన జనసేనను కూడా ఆ వ్యూహంలో భాగం చేసింది. అలా చేయడం ద్వారా తెలుగుదేశంను దెబ్బకొట్టగలిగామని సంబరపడుతోంది. అయితే వాస్తవానికి వాలంటీర్లపై రాజకీయ రచ్చ తెలుగుదేశం పార్టీకే లాభించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేన, వైసీపీ శ్రేణుల నుంచి కూడా అదే అభిప్రాయం వ్యక్తమౌతోంది. తులుగుదేశం పార్టీని విస్మరించి వైసీపీ చేస్తున్న విమర్శల ఆస్త్రాలన్నీ తెలుగుదేశం చాపకింద నీరులా విస్తరించేందుకు, క్షేత్రస్థాయిలో బలపడేందుకు దోహదపడుతోందని చెబుతున్నారు.