జగన్ సహా మోడీకి 30 మంది దత్తపుత్రులు!
posted on May 10, 2023 @ 9:45AM
మోడీకి 30 మంది దత్తపుత్రులు ఉన్నారు. వారిలో జగన్ ఒకరు. అదానీ వంటి పారిశ్రామిక వేత్తలను కాపాడేందకు ప్రధాని దేశ ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారు. దేశాన్ని రక్షించుకోవాలంటే.. మోడీని గద్దె దింపడం ఒక్కటే మార్గం. అందుకే దేశాన్నిరక్షించండి.. మోడీని ఓడించండి అన్ననినాదంతో విపక్షాల ఐక్యత కోసం వామపక్షాలు నడుంబిగించాయి.
అయితే ఏపీలో మాత్రం వారు తమ నినాదాన్ని ఒకింత సవరించుకున్నాయి. దేశానికి మోడీ ఎలాగో.. రాష్ట్రానికి జగన్ అలా తయారయ్యారనీ, సర్వ వ్యవస్థలనూ నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని యిరువురూ దెబ్బతీస్తున్నారని వామపక్షాలు అంటున్నాయి. లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒక చోట చేరుతారన్నట్లుగా.. విధ్వంసం, విద్వేషమే స్వీయ సిద్ధాంతంగా వ్యవహరిస్తున్న మోడీ, జగన్ లు యిద్దరూ ఏపీలో కుమ్మక్కై పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
యిరువురి మధ్యా రహస్య సంబంధం ఉందంటున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శ నారాయణ ఓ అడుగు ముందుకు వేసి జగన్ ను దుర్యోధనుడితో పోల్చారు. మూడు పదులకు పైగా సలహాదారులను ఏర్పాటు చేసుకుని ఏపీలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. బటన్ నొక్కితే సమస్యలు పరిష్కారం కావని హితవు పలికారు. బంకర్లలో కూర్చుని జగనన్నకు చెప్పండి అంటే ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. వెూదీ అండతో జగన్ విర్రవీగుతున్నారనీ, ఆ అండ పోయిన మరుక్షణం జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని నారాయణ అన్నారు.
వచ్చే ఎన్నికలలో బీజేపీతో సయోధ్య ఉన్న పార్టీలతో జతకట్టేది లేదని స్పష్టం చేశారు. మణిపూర్ ఘటనల నేపథ్యంలో అక్కడి నుంచి బయటకు రావాలంటే రూ.2500 ఉన్న టికెట్ ధరలను రూ.25 వేలు చేశారని మండిపడ్డారు. ఎయిర్ పోర్టులు ప్రజల సొమ్ముతో కట్టి విమాన సర్వీసులను మాత్రం పైవేట్ వాళ్లకు ఇవ్వటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను పైవేట్ పరం చేస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలంటే ఇవ్వమంటున్నారని.. కేవలం పైవేట్ వాళ్ళకే ఇస్తారట అంటూ సీపీఐ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ కృత్రిమంగా సృష్టించిన ఆర్థిక వ్యవస్థను అమెరికా సంస్థ గుర్తించి బయటకు తెచ్చిందన్నారు. ప్రధాని వెూదీ సహకారంతోనే అదానీ ఆ స్థాయికి ఎదిగారన్నారు. మోడీ దత్తపుత్రులు దేశాన్ని దోచుకుంటున్నారన్నారు.
బీజేపీని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కేరళ ప్రభుత్వాన్ని ఏమి చేయలేక బీజేపీ చొరవతో సినిమా తీయించారని విమర్శించారు. కర్ణాటకలో గెలుపు కోసం వెూడీ మతాల మధ్య చిచుపెడుతూ అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. అదానీ, వెూడీ బంధాన్ని ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష వేయించి అనర్హత వేటు గురయ్యేలా చేశారని నారాయణ ఆరోపించారు.
ఏపీలో అడుగడుగునా వెూడీకి సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారన్నారు. రాష్టాన్రికి రావాల్సిన ప్రయోజనాలకు బీజేపీ గండి కొడుతున్నా మద్దతు ఇస్తున్నారని నారాయణ అన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్.. యిరువురూ తమ ప్రజా వ్యతిరేక విధానాలతో ఎక్కడిక్కడ జనాన్ని దోపిడీకి గురి చేస్తున్నారనీ, వచ్చే ఎన్నికల్లో వీరిరువురినీ గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నారాయణ అన్నారు.