కిరణ్ సమైక్య వాదన: తెరాసకు కిక్కునిచ్చే టానిక్కు
posted on Sep 29, 2013 @ 11:43AM
కేంద్రం రాష్ట్ర విభజన చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత తెరాస భవిష్యత్ అయోమయంలో పడింది. కాంగ్రెస్ లో విలీనం కావాలా లేక ఆ పార్టీతో ఎన్నికలలో పొత్తులు పెట్టుకోవాలా అనే విషయంపై తీవ్ర ఆలోచనలు చేసిన తరువాత, విలీనం కంటే పొత్తులే ఇరు పార్టీలకి ఎక్కువ లాభదాయకమని నిర్ణయం అయింది. నాటి నుండి కేసీఆర్ కాంగ్రెస్ అధిష్టానాన్ని కొంచెం వెనకేసుకు వస్తూ, ఇద్దరికీ కొత్త ప్రత్యర్ధిగా మారిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు సీమాంద్ర కాంగ్రెస్ నేతలపై బాణాలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టాడు.
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఇస్తానని చెపుతోంది గనుక టీ-కాంగ్రెస్ నేతలు ఇక రంకెలు వేయననవసరం లేదు. కానీ, తెరాస కూడా చేతులు కట్టుకొని కూర్చొంటే అది ఆ పార్టీకే నష్టం. గనుకనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం వినిపించిన వెంటనే కాంగ్రెస్ నేతల కంటే ముందే తెరాస నేతలు ఆయనపై రంకెలు వేస్తూ టీ-కాంగ్రెస్ నేతలకు కర్తవ్యం ఉపదేశిస్తున్నారు.
తెరాస నేతలందరూ మూకుమ్మడిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై దాడి చేస్తున్నపటికీ, ఆయన చేస్తున్నసమైక్యవాదన వలనే వారికి తెలంగాణా ప్రజలను ఆకట్టుకొనే ఈ సదవకాశం దొరుకుతోందని చెప్పవచ్చును. తద్వారా ఇంతవరకు తెలంగాణా సాధించిన ఘనతను తమ ఖాతాలో వ్రాసుకొంటున్న టీ-కాంగ్రెస్ నేతలకు చెక్ పెడుతూ, తామే ఏకైక తెలంగాణా రక్షకులమని డంకా బజాయించి చెప్పుకొనే సదవకాశం తెరాస నేతలు పొందుతున్నారు. ఇందుకు వారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంతయినా ఋణపడి ఉండాలి. రానున్న ఎన్నికల వరకు లేదా తెలంగాణా రాష్ట్రo ఏర్పడే వరకు ముఖ్యమంత్రి, సీమాంధ్ర నేతలు, ఉద్యోగులు ప్రజలు రాష్ట్రవిభజనను ఎంతగా వ్యతిరేఖిస్తే అంతగా తెరాస బలపడుతుంది.
ఈరోజు హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో జరుగబోయే సకలజన భేరి సభకు ఊహించన దానికంటే చాలా ఎక్కువ ప్రజలు తరలి వస్తున్నట్లు తాజా సమాచారం. అందుకు ప్రధాన కారణం కేసీఆర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బూచిగా చూపించి, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడమే. ఈ రోజు జరిగే సభలో తెలంగాణకు వ్యతిరేఖంగా జరుగుతున్నా కుట్రల గురించి మరింత వివరంగా మాట్లాడుతానని కేసీఆర్ చిన్నసస్పెన్స్ కూడా సృష్టించారు.