కేసీఆర్ హామీ ఇప్పుడప్పుడే నెరవేరదా?
posted on Nov 27, 2015 @ 10:25AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు ఇవ్వడంలో దిట్ట. అవి తొందరగా నెరవేరుతాయా లేదా అన్నది కూడా ఆలోచించకుండా హామీలు ఇవ్వడంలో ఆయన తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. అయితే అప్పుడప్పుడు ఆయన చేసిన హామీలు అంత తొందరగా నెరవేరవు అని చాలాసార్లు నిరూపితమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అది నిజమని నిరూపితమైంది. అది కేసీఆర్ ఇచ్చిన కొత్త జిల్లాల హామీ విషయంలో. తెలంగాణలో ప్రస్తుతం 10 జిల్లాలు ఉన్న సంగతి తెలిసిందే. వీటికి తోటు ఇంకో పద్నాలుగు జిల్లాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించారు. దీనికి సంబంధించి ఏయే జిల్లాల్లో ఇంకా అదనంగా జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారో కూడా తెలిపారు. కానీ ఇప్పుడు ఈ కొత్త జిల్లాల ఏర్పాటు అంత సులభం కాదని చెపుతున్నారు ప్రభుత్వ అధికారులు.
అసలు వచ్చే సంవత్సరం.. తెలంగాణ ఆవిర్భావదినోత్సవం రోజు కల్లా ఈ కొత్త జిల్లాల ఏర్పాటు కావాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.. దీనికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా కేసీఆర్ ఆదేశాల మేరకూ ఆగమేగాల మీద కొత్త జిల్లాల ఏర్పాటు నివేదికను తయారుచేయడంలో బిజీ అయింది. అయితే దీనివల్ల అధికారులకు తెలసిన విషయం ఏంటంటే ప్రస్తుతం రెవెన్యూ శాఖ దగ్గర ఇంకా నిజాం కాలం నాటి సర్వే రికార్డులే ఉన్నాయని… వాటి ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేయడం కష్టమని. దీంతో ప్రస్తుతం ఉన్న భూమి రికార్డులను పూర్తిగా డిజిటైలైజ్ చేసిన తరువాతే కొత్త జిల్లాల ఏర్పాటు చేయొచ్చని.. దీనికి రెండు సంవత్సరాలైన పట్టవచ్చని కేసీఆర్ కు తెలిపినట్టు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ ఇచ్చిన హామీ ఇప్పుడప్పుడే నెరవేరేలా లేదని మరోసారి రుజువైంది.