బీజేపీ.. తెలంగాణ స్ట్రాటజీ ఏపీలో!
posted on Jun 20, 2023 @ 3:41PM
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య ఉన్న సంబంధం ఏంటని అడిగితే దోస్త్ మేరా దోస్త్ అని కాస్త రాజకీయంపై అవగాహనా ఉన్న ఎవరైనా విడమర్చి చెప్పేస్తారు. పబ్లిక్ గా కాకపోయినా ప్రైవేట్ గానైనా ఈ సంబంధం అంతా ఓపెనే. ఈ నాలుగేళ్లుగా బీజేపీతో వైసీపీ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. కేంద్రం హామీలని పక్కన పెట్టినా వైసీపీ నోరు మెదపలేదు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులన్నింటికీ వైసీపీ జీ హుజూర్ అంటూ మొప్పుపొందేందుకు చేయగలిగినంతా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అంత కంటే ఎక్కువే చేసింది. అడిగింది కాదనకా.. అడిగేదేందుకు నేను ఉండగా అన్నట్లు ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే కేంద్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బీజేపీ అడగకపోయినా తానున్నానంటూ ఏపీ సీఎం జగన్ ముందు నిలబడ్డారు. అందుకు ప్రతిఫలంగా బీజేపీ కూడా వైసీపీ అడిగినవన్నీ చేస్తూ వస్తోంది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకపోయినా అంతకు మించిన బంధం కొనసాగుతోందనీ.. ఈ బంధాన్ని తెంచుకోవడానికి రెండు పార్టీలకీ ఇసుమంతైనా ఇష్టం లేదని కూడా చెప్పుకున్నారు.
కానీ, ఈ మధ్య బీజేపీ అగ్రనాయకత్వం ఒక్కసారిగా వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. శ్రీకాళహస్తి, విశాఖపట్నంలలో ఏర్పాటు చేసిన సభలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ఇక్కడ చట్టం అమలు కావట్లేదని ఆరోపించారు. స్కాంలు తప్ప ఇక్కడేమీ జరగట్లేదని దుయ్యబట్టారు. కేంద్ర నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. దీంతో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పు వెనక కారణాలు ఏంటనే దానిపై రకరకాల ప్రచారం జరిగింది. బీజేపీ తెలుగుదేశంతో దోస్తీకి సిద్ధమైందనే ప్రచారం అందులో ప్రధానంగా వినిపించింది. బీజేపీ చేసిన విమర్శలకు వైసీపీ కూడా అదే స్థాయిలో విమర్శల వాన.. వాన ఏంటి విమర్శల సునామీనే సృష్టించింది.
అయితే అదే సమయంలో తెలుగుదేశం నేతలు కూడా బీజేపీపై విమర్శలు మొదలు పెట్టారు. జగన్ సర్కార్ అవినీతిపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోదు? రాష్ట్రంలో అసలు చట్టమే అమలు కావట్లేదని చెప్పిన హోంమంత్రి జగన్ ప్రభుత్వంపై చర్యలు తీసుకుని తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ బీజేపీని నిలదీసింది. దీంతో అసలు ఈ రాజకీయం ఏంటో.. ఎవరు ఎవరికి స్నేహితులో.. ఎవరు ఎవరికి శత్రువులుగా మారబోతున్నారో అర్ధం కాక ప్రజలు రకరకాల చర్చలు సాగిస్తున్నారు. అయితే దీని వెనక బీజేపీ భారీ స్కెచ్ ఒకటి ఉండొచ్చనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఒక్కసారి తెలంగాణ రాజకీయాలలోకి తొంగిచూస్తే ఈ స్కెచ్ ఏంటన్నది తేటతెల్లం అవుతుంది.
ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో అసలు ఉనికి ఉందా లేదా అన్నట్లున్న బీజేపీ ఈ స్థాయికి ఎదగడం వెనకున్న కారణం అప్పటి టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనేలా రెచ్చిపోవడం. నువ్వా నేనా అన్నట్లున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య బీజేపీ చేరి టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి కాంగ్రెస్ ను సైడ్ చేసింది. నేతల చేరికలతో పాటు ప్రభుత్వ లోపాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ అంచెలంచెలుగా ఎదిగే ప్రయత్నం చేసింది, చేస్తోంది. ఇందులో కొంతవరకు తెలంగాణలో సక్సెస్ అయ్యింది కూడా. ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు చాలా రాష్ట్రాలలో బీజేపీ ఎదుగుదల ఇలాగే జరిగింది. ఆ క్రమంలో మిత్రులను కూడా సైడ్ చేసి ఒక్కోమెట్టు ఎక్కింది. ఇప్పుడు అదే ఫార్ములాను ఏపీలో కూడా బీజేపీ ప్రయోగించాలనే ఆలోచన చేస్తుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
అయితే, బీజేపీ ఫార్ములా ఏపీలో సక్సెస్ అవుతుందా అంటే అనుమానమే. అప్పటి తెలంగాణలో బీజేపీ పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు ఏపీలో బీజేపీ పరిస్థితి మరింత దారుణం. పైగా తెలంగాణలో దెబ్బకొట్టిన కాంగ్రెస్ జాతీయ పార్టీ కాగా.. ఏపీలో టీడీపీ మూలాల వరకు చొచ్చుకుపోయిన రాష్ట్ర పార్టీ. ఇక ఏపీలో బీజేపీకి ఇలాంటి ఫార్ములాలను అమలు చేయగల సమర్ధ నేతలు కూడా లేరు. దీంతో అగ్రనేతలొచ్చి కాస్త కీ ఇచ్చినా.. ఇక్కడ లోకల్ గా దానిని అమలు చేసే సత్తా రాష్ట్ర బీజేపీ నాయకులలో కనిపించడం లేదు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతున్నా.. ప్రస్తుతానికి ఏపీలో అందుకు విభిన్న పరిస్థితులే కనిపిస్తున్నాయి.