దేశంలో కోవిడ్ వ్యాప్తి.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
posted on Dec 20, 2023 9:16AM
దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని భయం గుప్పెట్లోకి నెట్టివేస్తోంది. చైనాలో మొదలైన ఈ కొత్త వేరియంట్ కారణంగా ఇప్పటికే సింగపూర్ వంటి దేశాలలో కరోనా ప్రొటోకాల్ ను కంపల్సరీ చేశారు. ఆ దేశంలో మాస్కులు లేకుండా బయటకు రావడాన్ని నిషేధించారు. అదలా ఉండగా కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 ఇండియాకూ వ్యాపించింది. ముఖ్యంగా కేరళలో ఈ వేరియంట్ వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉంది. తెలంగాణలో కూడా కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టించింది. కొత్తగా రాష్ట్రంలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో కరోనా కొత్త వేరియంట్ బారిన పడిన వారు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్రలలో కూడా కరోనా కొత్త వేరియంట్ జేఎన్1 వ్యాప్తి చెందుతుండటంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆరోగ్యశాఖ సెక్రటరీలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కరోనా పరీక్షలను పెంచాలనీ, వ్యాప్తిని నిరోధించేలా చర్యలు తీసుకోవాలని ఆయనా లేఖలో పేర్కొన్నారు. ఇలా ఉండగా తెలంగాణలో గడిచిన 24 గంటలలో కొత్తగా విడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిసి ప్రస్తుతం రాష్ట్రంలో 9 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బిలిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో దాదాపు ఆరు నెలల తరువాత కోవిడ్ బులిటిన్ ను విడుదల చేయడం ఇదే తొలిసారి. ఇలా ఉండగా ఈ కొత్త వేరియంట్ లక్షణాలను కేంద్రం తెలిపింది. గతంలోలా కోవిడ్ పేషంట్లలో దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడం లేదనీ, కోవిడ్ కొత్త వేరియంట్ బారిన పడిన వారిలో కీళ్ల నొప్పులు, నడుంనొప్పి, ఆకలిలేకపోవడం, విపరీతమైన తల, మెడనొప్పి, న్యుమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంది. ఇలా ఉండగా కర్నాటకలో కోవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తిని గుర్తించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించే బయటకు రావాలన్న నిబంధనను మళ్లీ అమలులోకి తీసుకువచ్చింది.
ఇలా ఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్ వ్యాప్తి ఉధృతి తీవ్రంగా ఉంటుందని చెబుతూనే.. ఇది ప్రాణాంతకం కాదని పేర్కొంది. అందుబాటులో ఉన్న ఆధారాల పరంగా చూస్తే జేఎన్.1తో ప్రపంచానికి పెద్ద ప్రమాదంలేదని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో జేఎన్.1 వేరియెంట్‌తో పాటు వేర్వేరు కొవిడ్ వేరియెంట్ల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని వెల్లడించింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా జేఎన్.1 వ్యాప్తి తీవ్రత పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఈ వేరియంట్ ను తొలి సారిగా సెప్టెంబర్ లోనే అమెరికాలో గుర్తించారు. గత వారం చైనాలో కూడా 7 కేసుల నమోదయాయి. డిసెంబర్ 8 నాటికి అమెరికాలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 15 శాతం నుంచి 29 శాతం జేఎన్.1 వేరియెంట్ కేసులేనని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. ఇక చైనా, తరువాత ఈ వేరియంట్ పలు దేశాలలో గుర్తించారు. వేగంగా వ్యాప్తి చెందే ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యుహెచ్ఓ పేర్కొంది. కోవిడ్ పరీక్షలను తప్పని సరి చేయాలని ప్రపంచ దేశాలను సూచించింది.