పరువు కాపాడండి..ప్రధానితో బొత్స
posted on Jan 31, 2012 8:24AM
న్యూఢిల్లీ: రాష్ట్రానికి మీరు రాకపోతే కాంగ్రెసు ప్రభుత్వం పరువు పోతుంది కాబట్టి.. మీ పర్యటన రద్దును దయచేసి సమీక్షించండి అంటూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభ్యర్థించినట్లు తెలిసింది. రాజీవ్ యువకిరణాల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ఫిబ్రవరి 4న రాష్ట్రానికి రావాల్సిన ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకున్న నేపథ్యంలో.. మన్మోహన్‌ను బొత్స తన సతీమణి, విజయనగరం ఎంపీ ఝాన్సీతో కలిసి సోమవారం సాయంత్రం కలిశారు. అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో రాజీవ్ యువకిరణాలు సహా పలు రాజకీయ అంశాలపై ప్రధానితో బొత్స చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంకేతాలిచ్చినట్లవుతుందని, కాబట్టి పర్యటన రద్దుపై పునఃసమీక్షించుకోవాలని మన్మోహన్‌ను కోరినట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించిన వివరాలతో కూడిన రెండు ఫైళ్లను కూడా ప్రధానికి బొత్స సమర్పించినట్లు తెలుస్తోంది. అలాగే, మరిన్ని రాజకీయాంశాలపై కూడా ప్రధానితో పీసీసీ అధ్యక్షుడు చర్చించినట్లు సమాచారం.
ఇక.. రాష్ట్రంలో వరి ధాన్యం మద్దతు ధరను క్వింటాలుకు రూ.200 చొప్పున పెంచాలని ప్రధానిని బొత్స కోరారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించారు. దేశవ్యాప్తంగా పంటలకు కేంద్రం నిర్ణయించే కనీస మద్దతు ధరను ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా నిర్ధారించాలని కోరారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల పథకాలు రెండింటికీ జాతీయ హోదా కల్పించాలని కోరారు. పట్టణాలు, నగరాల్లో ప్రజా రవాణాను మెరుగు పర్చేందుకు జేఎన్ఎన్‌యూఆర్ఎం పథకం కింద కేంద్రం నిధులు ఇస్తోందని, ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాలకు సైతం కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ఆర్టీసీకి కేంద్రం సాయం చేయాలని అడిగారు. గ్రామీణ ప్రాంతాల మధ్య రోడ్డు సదుపాయాన్ని మెరుగుపర్చేందుకు అధికంగా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుపై వ్యతిరేకత వ్యక్తం కావటానికి ప్రధాన కారణం పునరావాస ప్యాకేజీ ఆకర్షణీయంగా లేకపోవటమేనని ప్రధానికి బొత్స తెలిపారు. ఆర్థిక సహాయాన్ని మరింత ఎక్కువ చేస్తే స్థానికుల్లో వ్యతిరేకత తగ్గుతుందని సూచించారు.