బ్రేక్‌ఫాస్ట్ చేయకుంటే గుండెపోటే!
posted on Dec 2, 2020 @ 9:30AM
బ్రేక్‌ఫాస్ట్ అన్న మాటలోనే ఉపవాసాన్ని విరమించడం అన్న అర్థం ధ్వనిస్తుంది. కానీ చాలామంది ఉదయాన్నే ఖాళీకడుపుతోనే పనిలోకి దూకేస్తుంటారు. ఇదేమంత ఆరోగ్యకరమైన అలవాటు కాదంటూ, ఒకదాని తరువాత ఒకటిగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
కొందరు దూరం
తీరిక లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే సన్నబడతామనే అపోహతో కావచ్చు... ఉదయపు అల్పాహారాన్ని ముట్టుకోనివారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఖాళీ కడుపుతో రోజుని మొదలుపెట్టకూడదని పెద్దలు హెచ్చరిస్తున్నా, పెడచెవిన పెట్టేవారు నానాటికీ ఎక్కువవుతున్నారు. ఇలా ఉదయపు అల్పాహారానికి దూరంగా ఉండటం వల్ల రక్తపోటు, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనీ.... అసలుకే మోసం వస్తుందనీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు! బ్రేక్‌ఫాస్టుని పట్టించుకోకుంటే ఏకంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉందంటూ ఒక పరిశోధన సైతం నిరూపిస్తోంది.
హార్వర్డు పరిశోధన
బ్రేక్‌ఫాస్టుకీ గుండెపోటుకి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించేందుకు హార్వర్డు విశ్వవిద్యాలయం తరఫున ఓ భారీ పరిశోధనను నిర్వహించారు. ఇందుకోసం పది కాదు వంద కాదు, దాదాపు 27,000 మందిని పరిశీలించారు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 16 ఏళ్ల పాటు వీరి ఆహారపు అలవాట్లను గమనించారు. వీరిలో 13 శాతం మంది తమకి ఉదయపు అల్పాహారం తీసుకునే అలవాటు లేదని తేల్చిచెప్పారు. ఆశ్చర్యకరంగా ఇలా అల్పాహారం తీసుకోవడం అలవాటు లేనివారిలోనే గుండెపోటు సమస్య ఎక్కువగా తలెత్తడాన్ని గమనించారు పరిశోధకులు. ఇక అల్పాహారం తీసుకోనివారిలో ధూమపానం, మద్యపానం, చిరుతిళ్లు తినడం, ఊబకాయం, రక్తపాటు వంటి లక్షణాలు కూడా ఉంటే... వారిలో గుండెపోటు వచ్చే అవకాశం 27 శాతం అధికమని తేలింది.
కారణం!
ఉదయం వేళ అల్పాహారాన్ని తీసుకోకపోవడానికీ, గుండెపోటుకీ మధ్య ఉన్న సంబంధం ఏమిటో పరిశోధకులు కూడా చెప్పలేకపోతున్నారు. కానీ కొన్ని వివరణలను మాత్రం ఇవ్వగలుగుతున్నారు.
- ఉదయం వేళ ఖాళీ కడుపుతో ఉండేవారిలో మధ్యాహ్నానికల్లా విపరీతంగా ఆకలి వేసే అవకాశం ఉంది. దాంతో అవసరమైనదానికంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు.
- మధ్యాహ్నం వరకూ ఖాళీగా ఉన్న శరీరంలోకి ఆకస్మాత్తుగా ఆహారం రావడంతో, రక్తంలో చక్కెర శాతం ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీనివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి దెబ్బతినడం, రక్తనాళాలలో కొవ్వు పేరుకోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం కలుగుతుంది.
- ఉదయం వేళ నిర్ణీత సమయంలో అల్పాహారాన్ని తీసుకునేవారిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనిపించింది. వీరు ఒక క్రమశిక్షణతో, తగిన ఆహారపు అలవాట్లతో ఉంటారు కాబట్టి సహజంగానే గుండెపోటు వీరి దరిచేరదు.
- నిర్జర.