నాందేడ్, రాయలసీమ, ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ రైళ్ళలో దొంగలు పడ్డారు
posted on Nov 6, 2015 7:58AM
ప్రజలు ఇళ్ళకు తాళాలు వేసుకొని ఊళ్లకు వెళితే ఇంట్లో దొంగలు పడుతుంటారు. కానీ పోలీసులు ఏమీ చేయలేరు. పోనీ రైల్లో అయినా భద్రత ఉంటుందా అంటే దారిలో దోపిడీ దొంగలు ఉన్నదంతా దోచుకొని పోతుంటారు. కానీ రైల్లో ఉండే రైల్వే పోలీసులు కూడా ఏమీ చేయలేరు.
నిన్న అర్ధరాత్రి ఒకేసారి నాందేడ్, రాయలసీమ, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో దొంగలు పడ్డారు. అనంతపురం జిల్లాలో గుత్తి రైల్వే స్టేషన్ శివార్లలో నాందేడ్, రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైళ్ళు సిగ్నల్ కోసం ఆగి ఉన్నప్పుడు, దొంగలు రైల్లో ప్రయాణికులను దోచుకొన్నారు. రైల్వే పోలీసులు ఉన్నప్పటికీ దొంగలు తెలివిగా వారి దృష్టిని మరోవైపు మళ్ళించి తమ పని కానిచ్చుకొని వెళ్ళిపోయారు. ఆ తరువాత ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికుల వంతు వచ్చింది. కానీ వారి అదృష్టం కొద్దీ గ్రీన్ సిగ్నల్ పడటంతో బ్రతికిపోయారు. మొదట దోపిడీకి గురయిన నాందేడ్ ఎక్స్ ప్రెస్ గుత్తి రైల్వే స్టేషన్ చేరుకొన్న వెంటనే అందులో ప్రయాణికులు రైల్వే పోలీసులకు పిర్యాదు చేసారు. కనీసం అప్పుడయినా రైల్వే పోలీసులు మేల్కొని ఉండి ఉంటే తరువాత వచ్చిన రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులు దొంగల బారిన పడేవారు కాదు. కానీ దేనినయినా ‘లైట్’ తీసుకోవడం రైల్వే పోలీసులకు అలవాటుగా మారిపోయింది కనుక ఇటువంటి సంఘటనలు తరచూ పునరావృతం అవుతూనే ఉంటాయి..వాటి గురించి ఇలాగ వార్తలు వస్తూనే ఉంటాయి.