తిరుపతి దొంగ ఓటర్లకు కరోనా?
posted on Apr 29, 2021 @ 1:57PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక రేపిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. పోలింగ్ రోజున పెద్ద ఎత్తున దొంగ ఓటర్లు పట్టుబడటం కలకలం రేపింది. ఇతర ప్రాంతాల నుంచి వందలాది బస్సులు, కార్లలో వచ్చిన దొంగ ఓటర్లను టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు రెడ్ హ్యాడెండ్ గానే పట్టుకున్నారు. అధికార పార్టీ నేతలు ఫేక్ ఓటరు ఐడీ కార్డులు స్పష్టించి లక్షలాదిగా దొంగ ఓట్లను వేయించుకున్నారని విపక్షాలు ఆరోపించాయి. తిరుపతి అసెంబ్లీ పరిధిలో పోలింగ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. దొంగ ఓటర్ల అంశంపై కోర్టుల్లోనూ కేసులు ఉన్నాయి.
అయితే తిరుపతి పోలింగ్ కు సంబంధించి సంచలన విషయాలు బయటపెడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో బయటి నుంచి వచ్చి దొంగ ఓట్లు వేసిన వారు కరోనా బారిన పడ్డారని చెప్పారు. పోలింగ్ రోజున దొంగ ఓట్లు వేసి, కరోనాకు గురై ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని చెప్పారు చింతా మోహన్. పోలింగ్ రోజున విధుల్లో ఉన్న సిబ్బంది కోట్లాది రూపాయలను వైసీపీ ఇచ్చిందని రెండు రోజుల క్రితం ఆరోపించారు చింతా మోహన్.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందేనని చింతా మోహన్ డిమాండ్ చేశారు. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. తన అవినీతి ఆరోపణల కేసుల్లో నిందితులుగా ఉన్న శ్రీలక్ష్మీ సహా పలువురు ఐఏఎస్ అధికారులకు జగన్ కీలక పోస్టులు ఇచ్చారని... కీలక శాఖల బాధ్యతలను అప్పగించారని విమర్శించారు. సాక్షులను తన అధికారంతో జగన్ ప్రభావితం చేస్తున్నారని చెప్పారు. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘిస్తుంటే కోర్టులు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. కోర్టులకు కళ్లు లేవా? అని చింతా మోహన్ నిలదీశారు.
ప్రజలు కూడా న్యాయస్థానాల చిత్తశుద్ధిని శంకిస్తున్నారని చింతామోహన్ అన్నారు. లక్ష రూపాయలు తీసుకున్నారనే కేసులో దళితనేత బంగారు లక్ష్మణ్ ను జైలుకు పంపారని... వందల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న జగన్ విషయంలో కోర్టులు కళ్లు మూసుకున్నాయని చెప్పారు. జగన్ కు ఒక న్యాయం, బంగారు లక్ష్మణ్ కు మరో న్యాయమా? అని చింతా మోహన్ అసహనం వ్యక్తం చేశారు.