మళ్లీ ఢిల్లీకి చంద్రబాబు!?
posted on Aug 16, 2022 @ 1:54PM
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. వచ్చే వారంలో ఆయన ఢిల్లీకి పయనమవనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ టూర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చోటు చేసుకున్న పరిణామాలు.. విపరీతంగా అప్పులు చేయడం.. టీడీపీ నేతలపై అక్రమ కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం.. దాడులకు దిగడం.. కేంద్ర పథకాలు.. తమ పథకాలంటూ జగన్ ప్రభుత్వం కలరింగ్ ఇవ్వడం తదితర అంశాలపై కేంద్రంలోని పెద్దలకు చంద్రబాబు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ మాసంలోనే చంద్రబాబు హస్తిన బాట పట్టే అవకాశం ఉందని తెలుగుదేశం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మోదీతో చంద్రబాబు భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే రానున్నది ఎన్నికల సీజన్.. దాంతో రాజకీయ సమీకరణాలు సైతం మారనున్నాయని వారు చెబుతున్నారు. మరోవైపు ఇటీవల ఢిల్లీలో మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నేషనల్ కమిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సమావేశమనంతరం చంద్రబాబు, మోదీ.. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. వీరిద్దరు కలిసి మాట్లాడుకోవడంపై తెలుగు రాష్ట్రాల్లోని మీడియా పలు కథనాలను ప్రచురించింది. అయితే వీరిద్దరు ఏం చర్చించుకున్నారన్నది మాత్రం బయటకు రాలేదు. కానీ ఇటీవల పార్టీ పాలిట్ బ్యూరో మీటింగ్‌లో చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ.. ఢిల్లీ పర్యటనలో మోదీతో చర్చించిన పలు అంశాలు వివరించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ప్రధాని మోదీ ఒక్కొక్కరినీ పలకరిస్తూ తానే వద్దకు వచ్చారని చంద్రబాబు చెప్పారని.. మనం కలిసి చాలా రోజులైందని.. ఢిల్లీ రావడం లేదా? అని చంద్రబాబును మోదీ ప్రశ్నించారట. ఢిల్లీలో తనకు పనేమీ లేదని.. అందుకే రావడం లేదని మోదీకి చంద్రబాబు సమాధానం ఇచ్చారు.
అలాగే మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయని.. మనం ఒకసారి కలవాలని చంద్రబాబుతో మోదీ చెప్పారట. తాను కూడా మిమ్మల్ని కలుద్దామనుకోంటున్నట్లు ఈ సందర్బంగా మోదీతో చంద్రబాబు చెప్పారట. ఓ సారి వీలు చూసుకుని ఢిల్లీ రావాలని.. మీరు వచ్చే ముందు నా కార్యాలయానికి సమాచారమిస్తే.. నాకు అనువుగా ఉన్న సమయం చెబుతానని మోదీ.. చంద్రబాబుతో పేర్కొన్నారని ఆయన స్వయంగా చెప్పారు.
ఏదీ ఏమైనా చంద్రబాబు ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ అయితే అధికార వైసీపీకి గుండెల్లో దడ పుట్టడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.