చంద్రబాబు ఆవేదన వలసలను అరికట్టగలదా?
posted on Feb 19, 2013 @ 8:14PM
గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీనుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకోన్నాయి. ఇంకా ఎన్నికల గంట మ్రోగక మునుపే పరిస్థితి ఇలాఉంటే, రేపు ఎన్నికల ప్రకటన వెలువడ్డాక పరిస్థితి ఎలా ఉంటుందో అని తెలుగుదేశం పార్టీకి బెంగ మొదలయింది.
ఒకవైపు పార్టీ అధినేత ఎన్నికల ముందు పార్టీని పటిష్టపరిచే ప్రయత్నంలో తన ఆరోగ్యాన్నికూడా పణంగా పెట్టి మరీ శ్రమపడి పాదయాత్రలు చేస్తుంటే, మరో వైపు జగన్ మోహన్ రెడ్డి జైల్లోకూర్చొన్నప్పటికీ తన కార్యకర్తలను, నాయకులను ఆకర్షింఛి తనవైపు తిప్పుకోవడం ఇంకో విచారకరమయిన విషయంగ చెప్పుకోవచ్చును.
యం.యల్.సి. బొడ్డు భాస్కర రామారావు, ఇచ్చాపురం యం.యల్.ఏ. సాయి రాజ్, పాతపట్నం మాజీ యం.యల్.ఏ. మోహన్ రావు, అతని కుమారుడు వెంకట రమణ, భీమిలి పార్టీ ఇన్-చార్జ్ ఆంజనేయులు మొదలయిన వారు ఇటీవల కాలంలో పార్టీని వీడి జగన్ పంచన చేరారు. కారణాలు ఏమయినప్పటికీ, వలసలు మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు.
దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న చంద్రబాబు ‘అటువంటి వారు సంతలో పశువుల్లాగా జగన్ మోహన్ రెడ్డి విసిరిన డబ్బులకి అమ్ముడుపోతున్నారని’ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా ఇంచుమించు అదే రీతిలో స్పందిస్తూ ‘పార్టీవల్ల రాజకీయ జీవితం, పేరు ప్రతిష్టలు అన్నీపొందిన నేతలు ఇప్పుడు స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం తల్లివంటి పార్టీకి ద్రోహం చేసి బయటకు పోతున్నారు. అటువంటి వారిని ఏమనాలి? మోసగాళ్లనాలా, 420 గాళ్ళని పిలవాలా, లేక ఇంకేమని పిలవాలి’ అని ఆవేశంగా ప్రశ్నించారు.
అందుకు సమాధానంగా జగన్ మోహన్ రెడ్డి మద్దతుదారులు ‘ఈ విషయంలో మీ తండ్రి మాత్రం ఏమి తక్కువ తిన్నాడు’ అంటూ నిలదీస్తున్నారు.
అయితే, చంద్రబాబు, లోకేష్ లేదా మరెవరో బాధపడతారని రాజకీయనాయకులు తమ ఆలోచనలను మార్చుకోరు. ఈ విషయం చంద్రబాబుకి కూడా బాగా తెలుసు. పార్టీ నుండి వలసలు మొదలయ్యాయని బాధపడుతూ వెళ్ళేవాళ్ళను నిందించుతూ కాలక్షేపం చేసే బదులు, యుద్ద ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేప్పట్టి ఉంటే, ఏమయినా ప్రయోజనం ఉండేది. తద్వారా కనీసం ఇక ముందు వలసల జోరు ఖచ్చితంగా తగ్గి ఉండేది.
కానీ, పాదయాత్ర పైనే దృష్టి కేంద్రీకరించిన చంద్రబాబు నాయుడు, పార్టీపై ఇంకా పట్టు సాదించని లోకేష్ గానీ, మరే సీనియర్ నాయకులు గానీ ఈ విషయం పై శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే ఇంకా వలసలు కొనసాగుతున్నాయి.
జైల్లో కూర్చొన్న జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ మీద వలవిసురుతున్నాడని వాపోయేబదులు, ఆ వల భారిన పడకుండా తన కార్యకర్తలని,నేతలని ఎలాగా కాపాడుకోవాలని ఆలోచించి ఉంటే ఫలితం ఉండేది. రాజకీయ పార్టీలు ఒకదానినొకటి ఆకర్షించుకోవడం నేడు కొత్తగా జరుగుతున్నదేమి కాదని అనుభవజ్ఞుడయిన చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసును. అటువంటప్పుడు పార్టీ అధినేతగా తానేమి చర్యలు చేప్పట్టి తన క్యాడర్ ను రక్షించుకోవాలో ఆలోచించాలి తప్ప, ఎదుటవాడిని ఆడిపోసుకోవడం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు.
ఇటీవల విశాఖ, కృష్ణా జిల్లాలలో పార్టీలో చెలరేగిన అంతర్ యుద్దాల వల్ల తలయెత్తిన అసంతృప్తిని ఆయన పూర్తిగా నివారించే ప్రయత్నం చేయకపోవడమే పార్టీ నిర్లిప్త ధోరణికి ఒక చక్కని ఉదాహరణ. ఏ రాజకీయ పార్టీ నాయకుడయినా ఎదో ఒక రకమయిన వ్యూహరచన చేసి శత్రువును యుద్దంలో ఓడింఛి తానూ గెలవాలనే ప్రయత్నిస్తాడు. అటువంటప్పుడు శత్రువును దీటుగా ఎదుర్కోవడానికి తగిన వ్యూహరచన చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చొని, శత్రువు తెలివిగా వ్యూహరచన చేస్తున్నాడని ఆరోపించడం అవివేకం.